World Cup 2023: దక్షిణాఫ్రికా కెప్టెన్‌ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే!

16 Nov, 2023 19:34 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బావుమా మరోసారి నిరాశపరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో సెమీఫైనల్లో బావుమా డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రోటీస్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో స్టార్క్‌ వేసిన ఓ అద్భుత బంతికి బావుమా వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈ మ్యాచ్‌లో డకౌటైన బావుమా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో డకౌట్‌గా వెనుదిరిగిన నాలుగో కెప్టెన్‌గా బావుమా నిలిచాడు. 40 ఏళ్ల వరల్డ్‌కప్‌ చరిత్రలో బావుమా కంటే ముందు ముగ్గురు కెప్టెన్లు సెమీఫైనల్స్‌లో ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యారు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్ అజారుద్దీన్ అగ్రస్ధానంలో ఉన్నాడు.

1996 వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్‌లో అజారుద్దీన్ డకౌటయ్యాడు.  అజారుద్దీన్‌ తర్వాతి స్ధానాల్లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హన్సీ క్రోంజే, ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ ఉన్నాడు. ఇక​ సెమీస్‌ ఫైనల్లో మాత్రం దక్షిణాఫ్రికా తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా  49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో డేవిడ్‌ మిల్లర్‌ విరోచిత శతకంతో చెలరేగాడు.  116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌, కమ్మిన్స్‌ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్‌, హెడ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: 'కోహ్లి, షమీ, అయ్యర్‌ హెడ్‌లైన్స్‌లో ఉంటారు.. కానీ అతడే రియల్‌ హీరో'

మరిన్ని వార్తలు