BBL 2023: కొలిన్‌ మున్రో ఊచకోత.. తృటిలో సెంచరీ మిస్‌.. ఎందుకంటే?

8 Dec, 2023 08:55 IST|Sakshi

బిగ్‌ బాష్‌ లీగ్‌ 2023 సీజన్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. గురువారం (డిసెంబర్‌ 7) జరిగిన టోర్నీ ఓపెనర్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌పై బ్రిస్బేన్‌ హీట్‌ 103 పరుగుల భారీ విజయం సాధించింది. బ్రిస్బేన్‌ గెలుపులో కొలిన్‌ మున్రో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 61 బంతులు ఎదుర్కొన్న మున్రో.. 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయంగా 99 పరుగులు చేశాడు.

చివరి ఓవర్‌లో మున్రోకు సెంచరీ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. మ్యాక్స్‌ బ్రయాంట్‌ (7 బంతుల్లో 15 నాటౌట్‌; 3 ఫోర్లు) కారణంగా ఆ అవకాశం చేజారింది. ఆఖరి ఓవర్‌ మూడో బంతికి సింగిల్‌ తీశాక​ మున్రో స్కోర్‌ 99కి చేరింది. అయితే ఆతర్వాత మూడు బంతులను బ్రయాంట్‌ బౌండరీలుగా తరలించడంతో మున్రోకు సెంచరీ చేసే అవకాశం రాలేదు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రిస్బేన్‌.. మున్రో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. బ్రిస్బేన్‌ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్‌ ఖ్వాజా (28), లబూషేన్‌ (30) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మెల్‌బోర్న్‌ బౌలర్లు జోయెల్‌ పారిస్‌, మ్యాక్స్‌వెల్‌, కౌల్డర్‌నైల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్‌బోర్న్‌ను బ్రిస్బేన్‌ బౌలర్లు 111 పరుగులకే (15.1 ఓవర్లలో) కుప్పకూల్చారు. మిచెల్‌ స్వెప్సన్‌ 3, మైఖేల్‌ నెసర్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌ చెరో 2 వికెట్లు, స్పెన్సర్‌ జాన్సన్‌, మాథ్యూ కున్హేమన్‌, పాల్‌ వాల్టర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. మెల్‌బోర్న్‌ ఇన్నింగ్స్‌లో హిల్టన్‌ కార్ట్‌వైట్‌ (33) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

>
మరిన్ని వార్తలు