BAN VS NZ 2nd Test: తొలి రోజు 15 వికెట్లు.. రెండో రోజు వర్షార్పణం

8 Dec, 2023 08:15 IST|Sakshi

బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మిర్పూర్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆటలో ఏకంగా 15 వికెట్లు నేలకూలగా, రెండో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గురువారం భారీ వర్షం వల్ల  స్టేడియం చిత్తడిగా మారింది. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే రెండో రోజు ఆట రద్దైంది.

కాగా, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కివీస్‌ బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. సాంట్నర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ చెరో 3 వికెట్లు, అజాజ్‌ పటేల్‌ 2, కెప్టెన్‌ సౌథీ ఓ వికెట్‌ పడగొట్టి బంగ్లాదేశ్‌ను ఆలౌట్‌ చేశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్‌ రహాం (35) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

అనంతరం తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన న్యూజిలాండ్ కూడా తడబడింది. బంగ్లా స్పిన్నర్ల ధాటికి ఆ జట్టు 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మెహిది హసన్‌ మీరజ్‌ 3, తైజుల్‌ ఇస్లాం 2 వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్‌ ఆటగాడు టామ్‌ లాథమ్‌ (4), డేవాన్‌ కాన్వే (11), కేన్‌ విలియమ్సన్‌ (13), హెన్రీ నికోల్స్‌ (1), టామ్‌ బ్లండెల్‌ (0) విఫలం కాగా.. డారిల్‌ మిచెల్‌ (12), గ్లెన్‌ ఫిలిప్స్‌ (5) క్రీజ్‌లో ఉన్నారు.

>
మరిన్ని వార్తలు