BGT 2023 IND VS AUS 2nd Test Day 2: లియోన్‌ మాయాజాలం.. ఐదేయడంతో పాటు అరుదైన రికార్డు

18 Feb, 2023 13:50 IST|Sakshi

Nathan Lyon: ఆసీస్‌ స్టార్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ మరోసారి రెచ్చిపోయాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. రెండో రోజు ఆట మొదలైనప్పటి నుంచే వీరలెవెల్లో విజృంభించిన లియోన్‌.. కేఎల్‌ రాహుల్‌ (17), రోహిత్‌ శర్మ (32), పుజారా (0), శ్రేయస్‌ అయ్యర్‌ (4), శ్రీకర్‌ భరత్‌ (6)లను పెవిలియన్‌కు పంపాడు. తద్వారా టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టడంతో పాటు ఓ అరుదైన క్లబ్‌లో చేరాడు.

స్పిన్‌ను సహకరించే వికెట్‌పై బంతిని గింగిరాలు తిప్పుతూ టీమిండియా ప్లేయర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న లియోన్‌.. టెస్ట్‌ల్లో భారత్‌పై 100 వికెట్లు తీసిన 3వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లియోన్‌ 100 వికెట్ల మైలురాయిని కేవలం 24 టెస్ట్‌ల్లో చేరుకోవడం మరో విశేషం. లియోన్‌కు ముందు జేమ్స్‌ ఆండర్సన్‌ (139), ముత్తయ్య మురళీథరన్‌ (105) మాత్రమే భారత్‌పై 100కు పైగా వికెట్లు పడగొట్టారు. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. ఆసీస్‌ స్పిన్నర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. కేవలం 152 మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఓ దశలో కోహ్లి (44), జడేజా (26)లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. 10 పరుగుల వ్యవధిలో వీరిద్దరు ఔట్‌ కావడంతో టీమిండియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కోహ్లి అంపైర్‌ వివాదాస్పద నిర్ణయానికి బలి కాగా.. జడేజా మర్ఫీకి వికెట్ల ముందు దొరికిపోయాడు.

లియోన్‌ 5 వికెట్లతో విజృంభించగా.. మర్ఫీ, మాథ్యూ కున్నెమన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అక్షర్‌ పటేల్‌ (4), అశ్విన్‌ (9) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌.. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 111 పరుగులు వెనుకపడి ఉంది.  అంతకుముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఖ్వాజా (81), హ్యాండ్స్‌కోంబ్‌ (72) అర్ధసెంచరీలతో రాణించగా.. టీమిండియా బౌలర్లు షమీ 4, అశ్విన్‌, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు. 

మరిన్ని వార్తలు