#Bishan Singh Bedi: భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. టీమిండియా మాజీ కెప్టెన్‌ మృతి

23 Oct, 2023 15:53 IST|Sakshi

భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్‌, దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు.  గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం (అక్టోబర్ 23) సోమవారం తుది శ్వాస విడిచారు. బేడీ 1967 నుంచి 1979 మధ్య కాలంలో భారత క్రికెట్‌లో కీలక ఆటగాడిగా బిషన్ సింగ్ బేడీ కొనసాగారు. టీమిండియా తరపున 67 టెస్టులు ఆడిన బేడి.. ఏకంగా 266 వికెట్లు పడగొట్టారు. అంతేకాకుండా పది వన్డేల్లో కూడా భారత జట్టుకు ఆయన ప్రాతినిథ్యం వహించారు.

10 వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టారు. 22 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్‌గా ఆయన వ్యవహరించారు. ఎర్రపల్లి ప్రసన్న, బేడీ, బీఎస్ చంద్రశేఖర్ , ఎస్. వెంకటరాఘవన్ లతో భారత స్పిన్ బౌలింగ్‌లో సరికొత్త  విప్లవానికి నాంది పలికారు. భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా ఆయన నిలిచారు.

అదే విధంగా భారత్ తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించాడు. 1975 ప్రపంచ కప్‌లో భాగంగా  తూర్పు ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 12 ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం 6 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టారు. అయన బౌలింగ్‌ కోటాలో ఏకంగా 8 మెయిడిన్‌ ఓవర్లు ఉండడం గమనార్హం.  1970లోనే పద్మ శ్రీ అవార్డు అందుకున్న బేడీ.. దేశీవాళీ క్రికెట్‌లో ఎక్కువగా ఢిల్లీ తరపున ఆడారు. 

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఆయన చాలా మంది క్రికెటర్లకు కోచ్‌గా, మెంటర్‌గా పనిచేశారు. అంతేకాకుండా ఈ జెంటిల్‌మెన్‌ గేమ్‌లో కొంతకాలంగా వ్యాఖ్యాతగా తన సేవలు అందించారు. 1990లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ పర్యటనల సమయంలో భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా ఆయన ఉన్నారు. మణిందర్ సింగ్,మురళీ కార్తిక్ వంటి అనేక మంది ప్రతిభావంతులైన స్పిన్నర్లకు భారత క్రికెట్‌కు పరిచయం చేసిన ఘనత ఆయనది. 1990 తర్వాత బీసీసీఐ ఛీప్‌ సెలక్టర్‌గా కూడా పనిచేశారు.

మరిన్ని వార్తలు