వరుసగా శతకాలు.. వరుసగా డక్‌లు!

31 Oct, 2020 16:19 IST|Sakshi

దుబాయ్‌:  ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి ప్లేయర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. సీఎస్‌కేతో సెంచరీ తర్వాత కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ధావన్‌ శతకం సాధించాడు. ఫలితంగా ఐపీఎల్‌లో ఈ ఫీట్‌ సాధించిన మొదటి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. మరి ఇప్పుడు వరుసగా డకౌట్‌లు అవుతున్నాడు ధావన్‌. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ధావన్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికి ధావన్‌ డకౌట్‌ అయ్యాడు. డ్రైవ్‌ షాట్‌ ఆడటానికి యత్నించి ఔటయ్యాడు. బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. 

అయితే అది ఔటా.. కాదా అనే థర్డ్‌ అంపైర్‌ చూసిన తర్వాత దాన్ని ఔట్‌గా ప్రకటించాడు. దాంతో ధావన్‌ రెండు బంతులాడి పరుగులేమీ చేయకుండా నిష్ర్కమించాడు. అంతకుముందు సన్‌రైజర్స్‌తో ఢిల్లీ ఆడిన మ్యాచ్‌లో సైతం ధావన్‌ డకౌటయ్యాడు. సందీప్‌ శర్మ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికి ధావన్‌ గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. వరుసగా రెండు సెంచరీలు, వరుసగా డకౌట్‌లు ఇప్పుడు ధావన్‌ను డైలమాలో పడేయడం ఖాయం. ధావన్‌ ఆడిన తన చివరి మూడు మ్యాచ్‌ల్లో 6,0,0గా పెవిలియన్‌ చేరాడు. వరుస రెండు సెంచరీల తర్వాత కేకేఆర్‌తో ఆడిన మ్యాచ్‌లో ధావన్‌ 6 బంతుల్లో 6 పరుగులు చేశాడు. ముంబైతో మ్యాచ్‌లో ధావన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరిన కాసేపటికి పృథ్వీషా(10) కూడా నిరాశపరిచాడు. దాంతో ఢిల్లీ 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. వీరిద్దర్నీ వేర్వేరు ఓవర్లలో బౌల్ట్‌ పెవిలియన్‌కు పంపాడు.

మరిన్ని వార్తలు