జడేజా పేసర్‌ అయితే బాగుండు.. మాకు చాన్స్‌ వచ్చేది

21 May, 2021 15:42 IST|Sakshi

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మీడియం పేసర్ అయి ఉంటే నాకు, కుల్దీప్‌కు జట్టుకు ఆడే అవకాశాలు ఎక్కువగా ఉండేవని స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ పేర్కొన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు కుల్దీప్‌, చహల్‌లు ఎంపిక కాలేదు. ఈ నేపథ్యంలో చహల్‌ స‍్పోర్ట్స్‌ టాక్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

'' నేను, కుల్దీప్‌ ఆడిన  సందర్భాల్లో జట్టులో హార్ధిక్‌ పాండ్యా ఉండేవాడు. అతను ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు సంపాదిస్తే.. మేమిద్దరం స్పెషలిస్టు స్పిన్నర్లుగా ఉన్నాం. కానీ 2018లో హార్దిక్‌ గాయంతో జట్టుకు దూరమవడం.. జడేజా వన్డే జట్టులోకి మళ్లీ ఆల్‌రౌండర్‌గా రావడం జరిగింది. జట్టుకు కీలకమైన ఏడో స్థానంలో అతను బ్యాటింగ్‌ చేయగల సమర్థుడు. అయితే అతని రాకను నేను తప్పుబట్టలేదు. జడేజా స్పిన్నర్‌ అవ్వడం మా దురదృష్టం. పాండ్యా లాగా అతను మీడియం పేసర్‌ అయి ఉండే మాకు ఎక్కువ అవకాశాలు వచ్చేవి. జడేజా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కావడంతో ఒక స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ అవసరం పడేది. దాంతో నాకు, కుల్దీప్‌ యాదవ్‌కు మధ్య పోటీ ఉండేది.

2017 చాంపియన్స్‌ ట్రోపీ తర్వాత మేమిద్దరం స్పిన్‌ బౌలింగ్‌ విభాగాన్ని నడిపించేవాళ్లం. ఇద్దరం 50-50 శాతంగా మ్యాచ్‌లు ఆడేవాళ్లం. ఉదాహరణకు ఐదు వన్డేల సిరీస్‌ తీసుకుంటే.. ఒకసారి కుల్దీప్‌ మూడు వన్డేలు ఆడితే.. నేను రెండు మ్యాచ్‌లు ఆడేవాడిని. హార్దిక్‌ ఉన్నంతవరకు అతను ఆల్‌రౌండర్‌ కోటాలో ఏడో స్థానంలో రావడంతో..  మాకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. జడేజా వచ్చాకా ఆ పరిస్థితి మారిపోయింది. అయినా ఏదైనా టీం డిమాండ్‌ మేరకే నడుచుకోవాలి.. జట్టుకు ఆడనంత మాత్రానా నేనేం బాధపడడం లేదు. నాకు వచ్చే అవకాశాలను ఉపయోగించుకుంటాను.. నేనున్నా లేకున్నా టీమిండియా గెలుపే నాకు ముఖ్యం'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌ల కెరీర్‌ అనుకున్నంత సాఫీగా లేదు. జట్టులోకి వచ్చిన కొత్తలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రెగ్యులర్‌ స్పిన్నర్లుగా కనిపించిన వీరిద్దరు తర్వాత తమ ఫామ్‌ను కోల్పోయారు. ముఖ్యంగా కుల్దీప్‌ ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. చహల్‌ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ మధ్యనే జరిగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌లో చహల్‌ ఆర్‌సీబీ తరపున బరిలోకి దిగి అంతగా ఆకట్టుకోలేదు.. ఇక కుల్దీప్‌ కేకేఆర్‌ జట్టులో ఉన్నా ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. చహల్‌ టీమిండియా తరపున 54 వన్డేల్లో 92 వికెట్లు, 48 టీ20ల్లో 62 వికెట్లు తీశాడు. ఇక కుల్దీప్‌ యాదవ్‌ 63 వన్డేల్లో 105 వికెట్లు.. 21 టీ20ల్లో 39 వికెట్లు.. 7 టెస్టుల్లో 26 వికెట్లు తీశాడు.
చదవండి: ఫీల్డింగ్‌లోనే కాదు.. గుర్రపుస్వారీతోను ఇరగదీశాడు

Kuldeep Yadav: క్రికెటర్‌ తీరుపై అధికారుల అసహనం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు