ICC: ఇంగ్లండ్‌కు షాకుల మీద షాకులు.. అదే జరిగితే! షకీబ్‌కు ముందే తెలుసు!

30 Oct, 2023 09:14 IST|Sakshi

WC 2023- ICC Champions Trophy 2025: వరల్డ్‌ కప్‌లో అత్యంత పేలవమైన ఆటతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చివరి స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ను మరో ప్రమాదం వెంటాడుతోంది. వన్డే క్రికెట్‌లో ఎనిమిది జట్లతో ఆడే మరో ప్రతిష్టాత్మక టోర్నీ చాంపియన్స్‌ ట్రోఫీకి ఆ జట్టు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021లోనే ఐసీసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రస్తుతం వరల్డ్‌ కప్‌లో టాప్‌–7లో నిలిచిన జట్లే చాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధిస్తాయి.

బంగ్లా కెప్టెన్‌కు ముందే తెలుసు
ఆతిథ్య దేశమైన పాకిస్తాన్‌కు నేరుగా అవకాశం లభిస్తుంది. టోర్నీలో ఆడుతున్న కొన్ని టీమ్‌లకు ఈ విషయంపై అవగాహన లేదని సమాచారం. అయితే ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్, బంగ్లాదేశ్‌ సారథి షకీబ్‌ అల్‌ హసన్‌ మాత్రం ఈ విషయం తమకు తెలుసని, టాప్‌–7 లక్ష్యంగా ఆడతామని కూడా చెప్పారు.

ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్‌లతో మ్యాచ్‌లు మిగిలి ఉన్న ఇంగ్లండ్‌ ఏ రకంగా ముందంజ వేస్తుందనేది చూడాలి. ఇక టాప్‌–7 నిబంధన కారణంగా ఈ వరల్డ్‌ కప్‌లో ఆడని వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వేలకు ఏ రకంగానూ చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడే అవకాశమే లేదు.

టీమిండియా అక్కడికి వెళ్తుందా?
మరోవైపు 2025లో పాకిస్తాన్‌ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీకి భారత్‌ వెళుతుందా... లేక భారత్‌ కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేస్తారా అనేది ఆసక్తికరం. చివరిసారి 2017లో చాంపియన్స్‌ ట్రోఫీ జరగ్గా... ఫైనల్లో భారత్‌పై గెలిచి  పాకిస్తాన్‌ తొలిసారి చాంపియన్‌గా నిలిచింది.  

ఇంగ్లండ్‌కు షాకుల మీద షాకులు
భారత్‌ వేదికగా ప్రపంచకప్‌-2023లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఏదీ కలిసి రావడం లేదు. టైటిల్‌ ఫేవరెట్‌ అనుకుంటే కనీసం సెమీస్‌ చేరే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పటిష్ట జట్టుగా పేరొందిన బట్లర్‌ బృందం ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటంటే ఒక్క విజయమే సాధించింది.

A post shared by ICC (@icc)

పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి ‘పసికూన’ నెదర్లాండ్స్‌ కంటే అధ్వాన్న స్థితిలో నిలిచింది. తాజాగా టీమిండియా చేతిలో 100 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌.. తదుపరి ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌, పాకిస్తాన్‌లపై గెలుపొంది పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంటేనే చాంపియన్స్‌ ట్రోఫీ ఆడే అవకాశం ఉంటుంది. లేదంటే మరో ఘోర పరాభవం తప్పదు.

చదవండి:  CWC 2023: ఇంగ్లండ్‌పై గ్రాండ్‌ విక్టరీ.. రోహిత్‌ శర్మ సాధించిన ఘనతలు

మరిన్ని వార్తలు