Cheteshwar Pujara: నా ఆటలో దూకుడు పెంచాను..

24 Nov, 2021 05:18 IST|Sakshi
మంగళవారం ప్రాక్టీస్‌ సందర్భంగా పుజారా, కోచ్‌ ద్రవిడ్‌

కాన్పూర్‌: ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడటం వల్లే తన ఆటతీరులో మార్పు వచ్చిందని, అంతే తప్ప బ్యాటింగ్‌ టెక్నిక్‌ మార్చలేదని భారత టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా అన్నాడు. మూడేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేకపోవడం లోటే అయినా అదేం పెద్ద సమస్య కాదని అన్నాడు. జట్టు విజయాలకు తాను చేసే 80, 90 పరుగులు దోహదం చేసినపుడు ఏ బెంగా ఉండబోదని చెప్పాడు.

విమర్శల తాకిడి తర్వాత ఇంగ్లండ్‌లో తాను బ్యాటింగ్‌లో దూకుడు పెంచిన మాట వాస్తవమేనని పుజారా అన్నాడు. ‘నా బ్యాటింగ్‌లో వేగం పెరిగింది. ఇది నా ఆటతీరుకు భిన్నమే, కానీ... టెక్నిక్‌ విషయంలో నేను ఏమాత్రం మారలేదు. ఆ అవసరం కూడా లేదనే అనుకుంటున్నాను. నేను ధాటిగా ఆడేందుకు ఇంగ్లండ్‌ పర్యటన దోహదం చేసింది’ అని అన్నాడు. లీడ్స్, ఓవల్‌ వేదికలపై వరుసగా 91 పరుగులు, 61 పరుగులతో పుజారా రాణించాడు. ‘ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఒత్తిడి లేకుండా ఆడాలనుకున్నాను. ఈ మైండ్‌సెట్‌తోనే మైదానంలో దిగాను. స్వేచ్ఛగా నా ఆట నేను ఆడుకున్నాను.

సమయమొచ్చినపుడు సెంచరీ కూడా సాధిస్తాను. దాని గురించి ఏ బాధ లేదు. జట్టుకు అవసరమైన సమయంలో పరుగులైతే చేస్తూనే ఉన్నాను’ అని అన్నాడు. కొత్తగా వైస్‌ కెప్టెన్సీని బాధ్యతగా భావిస్తానని చెప్పాడు. వైస్‌ కెప్టెన్‌ కానప్పుడే జూనియర్లతో ఎప్పుడు తన అనుభవాన్ని పంచుకున్నానని... ఇకమీదటా  అంతేనని తెలిపాడు. రహానే అద్భుతంగా ఆడుతున్నాడని, భారీ స్కోరుకు ఒక ఇన్నింగ్స్‌ దూరంలో ఉన్నాడని సహచరుడిపై విశ్వాసం వ్యక్తం చేశాడు. కొత్త కోచ్‌ ద్రవిడ్‌ రాకతో కుర్రాళ్ల ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని చెప్పాడు. ‘ఎ’ జట్ల మధ్య జరిగిన సిరీస్‌ సమయం లో ద్రవిడ్‌తో పనిచేసిన అనుభవం ఉందన్నాడు.
 

>
మరిన్ని వార్తలు