గర్జించిన గంభీర్‌.. క్రిస్‌ గేల్‌ పోరాటం వృధా

7 Dec, 2023 09:26 IST|Sakshi

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ 2023 సీజన్‌లో మరో రసవత్తరమైన మ్యాచ్‌ జరిగింది. గుజరాత్‌ జెయింట్స్‌-ఇండియా క్యాపిటల్స్‌ మధ్య నిన్న (డిసెంబర్‌ 6) జరిగిన మ్యాచ్‌ చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై ఇండియా క్యాపిటల్స్‌ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. క్రిస్‌ గేల్‌ (55 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), కెవిన్‌ ఓబ్రెయిన్‌ (33 బంతుల్లో 57ప 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో పోరాడినప్పటికీ గుజరాత్‌ను గెలిపించలేకపోయారు. క్యాపిటల్స్‌ నిర్ధేశించిన లక్ష్యానికి గుజరాత్‌ 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 

గర్జించిన గంభీర్..
తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ (30 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టాని​కి 223 పరుగులు చేసింది. క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో కిర్క్‌ ఎడ్వర్డ్స్‌ (26), కెవిన్‌ పీటర్సన్‌ (26), రికార్డో పావెల్‌ (28), బెన్‌ డంక్‌ (30), చిప్లి (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో ఎమ్రిట్‌, రజత్‌ భాటియా చెరో 2 వికెట్లు.. శ్రీశాంత్‌, లడ్డా, ప్రసన్న తలో వికెట్‌ దక్కించుకున్నారు.

గేల్‌ పోరాటం వృధా..
224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌.. క్రిస్‌ గేల్‌, కెవిన్‌ ఓబ్రెయిన్‌ పోరాడినప్పటికీ విజయతీరాలకు చేరలేకపోయింది. గేల్‌, ఓబ్రెయిన్‌ క్రీజ్‌లో ఉండగా.. గుజరాత్‌ గెలుపు సునాయాసమేనని అంతా అనుకున్నారు. అయితే ఆ జట్టు ఆఖరి 3 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది.

గేల్‌, ఓబ్రెయిన్‌లకు ఇతరుల నుంచి సహకారం లభించకపోవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. జాక్‌ కల్లిస్‌ (11), రిచర్డ్‌ లెవి (11), అభిషేక్‌ ఝున్‌ఝున్‌వాలా (13) విఫలమయ్యారు. క్యాపిటల్స్‌ బౌలర్లలో రస్టీ థీరన్‌, ఈశ్వర్‌ పాండే చెరో 2 వికెట్లు.. ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌, ఇసురు ఉడాన తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

>
మరిన్ని వార్తలు