Cheteshwar Pujara: పుజారాకు అరుదైన అవకాశం.. కెప్టెన్‌గా ఛాన్స్‌! అతడిపై నమ్మకం ఉంది!

19 Jul, 2022 16:12 IST|Sakshi
ఛతేశ్వర్‌ పుజారా(PC: Sussex Cricket)

టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ ఛతేశ్వర్‌ పుజారాకు అరుదైన అవకాశం లభించింది. ఇంగ్లండ్‌ కౌంటీ చాంపియన్‌షిప్‌ డివిజన్‌ టూ-2022లో భాగంగా ససెక్స్‌ జట్టుకు సారథిగా వ్యవహరించే ఛాన్స్‌ దొరికింది. కాగా ససెక్స్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ టామ్‌ హైన్స్‌ గత వారం లీసెస్టెర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌ మధ్యలో గాయపడ్డాడు. అతడి స్థానంలో పేసర్‌ స్టీవెన్‌ ఫిన్‌ కెప్టెన్సీ చేశాడు.

అయితే, టామ్‌ చేతి ఎముక విరగడంతో ఐదు నుంచి ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమైంది. ఈ నేపథ్యంలో టామ్‌ స్థానంలో మిడిల్సెక్స్‌తో మ్యాచ్‌కు పుజారా తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ సందర్భంగా సస్సెస్‌ హెడ్‌కోచ్‌ ఇయాన్‌ సలిస్బరీ మాట్లాడుతూ.. పుజారా జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు.

పుజారాపై నమ్మకం ఉంది!
ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘పూజ్‌.. టామ్‌ స్థానాన్ని భర్తీ చేయగలడు. జట్టులో చేరిన నాటి నుంచే తన అపార అనుభవంతో సహజంగానే నాయకుడిగా ఎదిగాడు. టామ్‌ గాయపడిన నేపథ్యంలో కెప్టెన్సీ చేపట్టాడు. 

గత మ్యాచ్‌లో ఫిన్నీ సారథిగా ఉన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌కు మాత్రం ఓ బ్యాటర్‌ను సారథిగా ఎంపిక చేయాలనుకున్నాం. ఎందుకంటే ఫిన్‌ బౌలింగ్‌ దళాన్ని ముందుకు నడిపించడంపై దృష్టి సారిస్తాడు. అదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అనువజ్ఞుడైన పూజ్‌.. కెప్టెన్‌గా సరైన వ్యక్తి అని భావించాము’’ అని పేర్కొన్నాడు.

కాగా లార్డ్స్ వేదికగా ససెక్స్‌, మిడిల్సెక్స్‌ మధ్య మంగళవారం(జూలై 19) టెస్టు మ్యాచ్‌ ఆరంభమైంది. ఇదిలా ఉంటే.. మిడిల్సెక్స్‌ జట్టులో టీమిండియా బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక చాలా కాలం తర్వాత ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టుతో జాతీయ జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగులే చేసి నిరాశపరిచాడు.

అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 168 బంతులు ఎదుర్కొన్న నయావాల్‌ 66 పరుగులు చేశాడు. క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినప్పటికీ బ్రాడ్‌ బౌలింగ్‌లో అవుటై పెవిలియన్‌ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్లు జో రూట్‌, జానీ బెయిర్‌ స్టో అజేయ శతకాలతో చెలరేగడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 2-2తో సమమైంది.

చదవండి: India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌.. షెడ్యూల్‌, జట్లు, పూర్తి వివరాలు!
ICC WC: కోహ్లి కెప్టెన్సీలో గనుక నేను ఆడి ఉంటే.. ఇండియా 3 ప్రపంచకప్‌ టైటిళ్లు గెలిచేది!

మరిన్ని వార్తలు