CWC 2023: నిన్నటి రోజు మనది కాకుండా పోయింది.. మోదీకి ధన్యవాదాలు: షమీ భావోద్వేగం

20 Nov, 2023 15:52 IST|Sakshi

ICC WC 2023- Mohammad Shami Post Goes Viral: వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ఓటమిపై టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ స్పందించాడు. టోర్నీ ఆసాంతం తాము అద్బుతంగా ఆడామని.. కానీ నిన్నటి రోజు మాత్రం తమది కాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పడిలేచిన కెరటంలా తిరిగి పుంజుకుని అభిమానులను గర్వపడేలా చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

కాగా అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం(నవంబరు 19) జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో ఆస్ట్రేలియా భారత జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

అజేయ జట్టు.. ఆఖరి మెట్టుపై బోల్తా
ఈ ఎడిషన్‌లో లీగ్‌ దశ నుంచి ఓటమన్నదే ఎరుగని రోహిత్‌ సేనకు తొలి ఓటమిని రుచి చూపించి.. ఏకంగా ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. దీంతో.. మనోళ్లు కప్‌ గెలుస్తారని ఆశగా ఎదురుచూసిన కోట్లాది మంది అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. సొంతగడ్డపై భారత్‌ను మరోసారి చాంపియన్‌గా చూడాలనుకున్న స్వప్నాలు చెదిరిపోయాయి.

ఈ నేపథ్యంలో మహ్మద్‌ షమీ ‘ఎక్స్‌’ వేదికగా తన భావాలు పంచుకున్నాడు. ‘‘దురదృష్టవశాత్తూ నిన్నటి రోజు మనది కాకుండా పోయింది. జట్టుకు, నాకు టోర్నీ ఆసాంతం మద్దతుగా నిలిచిన భారతీయులందరికి పేరుపేరునా కృతజ్ఞతలు.

మోదీజీకి థాంక్స్‌
ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ జీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన డ్రెస్సింగ్‌ రూంకి వచ్చి మాలో స్ఫూర్తిని నింపారు. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని షమీ ఉద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేశాడు. ప్రధాని మోదీ తనను ఆత్మీయంగా హత్తుకుని ఓదార్చుతున్న ఫొటోను జత చేశాడు.

ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా భారత పేస్‌ త్రయంలో కీలకమైన మహ్మద్‌ షమీకి ప్రపంచకప్‌-2023 ఆరంభ మ్యాచ్‌లలో ఆడే అవకాశం రాలేదు. హార్దిక్‌ పాండ్యా రూపంలో పేస్‌ ఆల్‌రౌండర్‌ అందుబాటులో ఉండటంతో షమీని పక్కనపెట్టారు.

ఆరంభంలో చోటే లేదు.. హయ్యస్ట్‌ వికెట్‌ టేకర్‌గా
జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌లకు తుదిజట్టులో చోటిచ్చే క్రమంలో అతడికి తుదిజట్టులో చోటు లేకుండా పోయింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పాండ్యా గాయపడగా షమీ జట్టులోకి వచ్చాడు.

లీగ్‌ దశలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్‌ పేసర్‌ ఐదు వికెట్ల హాల్‌తో మెరిశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై 4, శ్రీలంకపై 5, సౌతాఫ్రికాపై 2 వికెట్లు పడగొట్టాడు. ఇక న్యూజిలాండ్‌తో సెమీస్‌లో ఏకంగా రికార్డు స్థాయిలో ఏడు వికెట్లు కూల్చాడు.

ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా మొత్తంగా 24 వికెట్లు తీసిన షమీ.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచి అవార్డు అందుకున్నాడు. 

చదవండి: CWC 2023: అత్యుత్తమ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్‌.. ఆసీస్‌ హీరోకు నో ఛాన్స్‌ 

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు