'ధోనికి అనుకూలం.. టైటిల్ మాత్రం కష్టమే'‌

17 Sep, 2020 13:01 IST|Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్ 13వ సీజన్‌ ప్రారంభం కాకముందే టైటిల్‌ ఎవరు గెలుస్తారనేదానిపై మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు ఎవరికి వారు తమకు నచ్చినట్లుగా జోస్యం చెబుతున్నారు. ఒకరు ముంబై లేదా చెన్నై గెలుస్తుందని అంటే.. మరొకరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఐపీఎల్‌ టైటిల్‌ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. కానీ భారత మాజీ ఆటగాడు.. లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ మాత్రం ఐపీఎల్‌ 2020 టైటిల్‌ను చెన్నైసూపర్‌ కింగ్స్‌ గెలవడం కష్టమేనంటూ భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పిన ధోనికి మాత్రం ఈ ఐపీఎల్‌ లాభదాయకంగా మారుతుందని.. ఎందుకంటే అతనిపై ఒత్తిడి అంతగా ఉండకపోవడమే కారణమని తెలిపాడు. స్పోర్ట్స్‌టాక్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సునీల్‌ గవాస్కర్ఈ వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : కెరీర్‌లో ఇలాంటి గాయాలు సహజమే : హార్దిక్‌)

'సురేశ్‌ రైనా, హర్బజన్‌ లేని లోటు చెన్నై జట్టులో స్పష్టంగా కనబడుతుంది. ఇద్దరు స్టార్‌ ఆటగాళ్ల సేవలను కోల్పోయిన చెన్నై జట్టులో ఉన్న యువ ఆటగాళ్లతో ఎంతమేరకు రాణిస్తుందనేది చూడాలి. ఎందుకంటే జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లు ఉంటేనే సమతూకంగా ఉంటుందని.. కానీ చెన్నైలో ప్రస్తుతం అది మిస్సయింది. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టైటిల్‌ గెలవడం కొంచెం కష్టంగా మారింది. అయితే జట్టులో సీనియర్‌ ఆటగాడిగా.. కెప్టెన్‌గా ఉన్న ఎంఎస్‌ ధోనికి మాత్రం ఐపీఎల్‌ లాభదాయకంగా ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన ధోనికి ఒత్తిడి లేకపోవడం దూకుడుగా ఆడేందుకు అవకాశం ఉంది. ఒక కెప్టెన్‌గా జట్టును విజయవంతంగా నడిపిస్తాడనంలో సందేహం లేదు. అయితే యువ ఆటగాళ్లు ఎంతమేర సహకరిస్తారనేది చూడాలి.' అంటూ తెలిపాడు.

ఇక ఐపీఎల్‌ 13వ సీజన్‌కు గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో చెన్నై జట్టు కేవలం నలుగురిని మాత్రమే కొనుగోలు చేసింది.. మిగతావారిని తనవద్దే ఉంచుకొని డాడీస్‌ ఆర్మీ ట్యాగ్‌గా ముద్రించుకుంది.  రైనా, హర్భజన్‌ గైర్హాజరీలో చెన్నై జట్టులో ధోని, డుప్లెసిస్‌, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, షేన్‌ వాట్సన్‌ లాంటి సీనియర్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఒక బౌలింగ్‌లో జోష్‌ హాజల్‌వుడ్‌, డ్వేన్‌ బ్రేవో, ఇమ్రాన్‌ తాహిర్‌, మిచెల్‌ సాంట్నర్‌లు ఉన్నారు. కాగా చెన్నై జట్టు  ముంబై ఇండియన్స్‌తో సెప్టెంబర్‌ 19న  తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. (చదవండి : ‘టీ 20 క్రికెట్‌లో అతడే ప్రమాదకర ఆటగాడు’)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు