CWC 2023: 31 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా..!

13 Nov, 2023 11:45 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్-2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి, లీగ్‌ దశ అనంతరం అజేయ జట్టుగా నిలిచిన భారత్‌.. ఆదివారం నెదర్లాండ్స్‌పై గ్రాండ్‌ విక్టరీతో పలు ప్రపంచకప్‌ రికార్డులు బద్దలు కొట్టింది. ఇందులో ఓ రికార్డును భారత్‌ 31 ఏళ్ల అనంతరం సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏకంగా తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించి, వరల్డ్‌కప్‌ రికార్డును సమం చేశాడు. వరల్డ్‌కప్‌ చరిత్రలో కేవలం మూడుసార్లు మాత్రమే ఓ మ్యాచ్‌లో తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించారు. 

1987 వరల్డ్‌కప్‌లో తొలిసారి ఇలా జరిగింది. నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొమ్మిది మంది బౌలర్లతో బౌలింగ్‌ చేయించింది. అనంతరం 1992 వరల్డ్‌కప్‌లో రెండోసారి ఇలా జరిగింది. పాకిస్తాన్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించింది. 

తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించడంతో వరల్డ్‌కప్‌ చరిత్రలో 31 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌, జడేజా, విరాట్‌, రోహిత్‌, షమీ, గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ బౌలింగ్‌ చేయగా.. బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌, జడేజా తలో 2 వికెట్లు, విరాట్‌, రోహిత్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. షమీ, గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లకు వికెట్‌ దక్కలేదు. 

ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (61), శుభ్‌మన్‌ గిల్‌ (51), విరాట్‌ కోహ్లి (51) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ భారత బౌలర్లు తలో చేయి వేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. 
 

మరిన్ని వార్తలు