CWC 2023: సిక్సర్ల టీమిండియా.. సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లను తలదన్ని..!

13 Nov, 2023 12:11 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పలు ప్రపంచకప్‌ రికార్డులను కొల్లగొట్టింది. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత రికార్డులతో పాటు పలు టీమ్‌ రికార్డులు కూడా బద్దలయ్యాయి. నిన్నటి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు 16 సిక్సర్లు బాదడంతో తొలిసారి ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో భారత్‌ 200కు పైగా సిక్సర్లు నమోదు చేసింది. నెదర్లాండ్స్‌పై 16 సిక్సర్లు కలుపుకుంటే ఈ ఏడాది వన్డేల్లో భారత్‌ సిక్సర్ల సంఖ్య 215కు చేరింది. 

వన్డే క్రికెట్‌ చరిత్రలో ఏ జట్టూ ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. భారత్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉండేది. ఇదే ఎడిషన్‌లో సౌతాఫ్రికా 200 సిక్సర్ల మార్కును తాకింది. సఫారీలు ఈ ఏడాది వన్డేల్లో 203 సిక్సర్లు బాదారు. క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డే సిక్సర్లు బాదిన జట్ల జాబితాలో భారత్‌, సౌతాఫ్రికా మధ్యలో వెస్టిండీస్‌ ఉంది. ఈ జట్టు 2019లో 209 సిక్సర్లు బాదింది. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ (2015లో 179 సిక్సర్లు), ఆస్ట్రేలియా (2023లో 165 సిక్సర్లు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. 

ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (61), శుభ్‌మన్‌ గిల్‌ (51), విరాట్‌ కోహ్లి (51) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ భారత బౌలర్లు తలో చేయి వేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. 

మరిన్ని వార్తలు