WC 2023: కాన్వే, రచిన్‌ విధ్వంసకర శతకాలు.. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్‌

5 Oct, 2023 20:50 IST|Sakshi

కాన్వే, రచిన్‌ విధ్వంసకర శతకాలు.. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్‌
గత వరల్డ్‌కప్‌ (2019) ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన అపజయానికి న్యూజిలాండ్‌ టీమ్‌ ప్రతీకారం​ తీర్చుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ జరిగిన వరల్డ్‌కప్‌ ఆరంభ మ్యాచ్‌లో కివీస్‌ టీమ్‌.. ప్రపంచ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను 9 వికెట్ల భారీ తేడాతో చిత్తు​ చేసి, మెగా టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్‌; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), రచిన్‌ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్‌; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన శతకాలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్‌ 36.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. 

శతక్కొట్టిన రచిన్‌ రవీంద్ర.. గెలుపుకు చేరువైన కివీస్‌
వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రచిన్‌ రవీంద్ర అద్భుతమైన సెంచరీతో కదంతొక్కాడు. రచిన్‌ 82 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. రచిన్‌కు కెరీర్‌లో ఇది తొలి శతకం. మరో ఎండ్‌లో కాన్వే (111) సెంచరీ పూర్తయ్యాక కూడా నిలకడగా ఆడుతున్నారు. 30.4 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 214/1గా ఉంది. న్యూజిలాండ్‌ గెలుపుకు కేవలం 69 పరుగుల దూరంలో ఉంది.   

డెవాన్‌ కాన్వే మెరుపు శతకం.. గెలుపుకు చేరువైన కివీస్‌
న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే 83 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో ఐదో శతకాన్ని పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో రచిన్‌ రవీంద్ర (90) కూడా శతకానికి చేరువయ్యాడు. ఈ ఇద్దరి మెరుపు ఇన్నింగ్స్‌ల సహకారంతో కివీస్‌ ఆడుతూపాడుతూ విజయం దిశగా సాగుతుంది. 26.1 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 193/1గా ఉంది.

శతకాల దిశగా పరుగులు పెడుతున్న కాన్వే, రచిన్‌
న్యూజిలాండ్‌ బ్యాటర్లు రచిన్‌ రవీంద్ర (71), డెవాన్‌ కాన్వే (82) శతకాల దిశగా దూసుకుపోతున్నారు. వీరిద్దరి ధాటికి స్కోర్‌ బోర్డు పరుగులు పెడుతుంది. 20 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 154/1గా ఉంది. న్యూజిలాండ్‌ గెలవాలంటే 30 ఓవర్లలో 129 పరుగులు చేయాలి. 

హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకున్న కాన్వే, రచిన్‌
న్యూజిలాండ్‌ బ్యాటర్లు డెవాన్‌ కాన్వే (62 నాటౌట్‌), రచిన్‌ రవీంద్ర (58 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 15 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 121/1గా ఉంది. న్యూజిలాండ్‌ గెలవాలంటే 35 ఓవర్లలో 162 పరుగులు చేయాలి.

లక్ష్యం దిశగా దూసుకుపోతున్న న్యూజిలాండ్‌
283 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ ధాటిగా ఆడుతుంది. ఆ జట్టు ఏడో బంతికే తొలి వికెట్‌ కోల్పోయినప్పటికీ.. వన్‌డౌన్‌లో వచ్చిన రచిన్‌ రవీంద్ర (47), డెవాన్‌ కాన్వే (44) ధాటిగా ఆడుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 11 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 92/1గా ఉంది. 

టార్గెట్‌ 283.. రెండో ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
283 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ ఏడో బంతికే వికెట్‌ కోల్పోయింది. సామ్‌ కర్రన్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి విల్‌ యంగ్‌ డకౌటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 19/1గా ఉంది. డెవాన్‌ కాన్వే (11), రచిన్‌ రవీంద్ర (8) క్రీజ్‌లో ఉన్నారు.

పడి లేచిన ఇంగ్లండ్‌.. గౌరవప్రదమైన స్కోర్‌
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి న్యూజిలాండ్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ రూట్‌ (77), బట్లర్‌ (43) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గట్టెక్కించారు. ఆఖర్లో టెయింలెండర్లు మేము సైతం అని ఓ చేయి వేయడంతో ఇంగ్లండ్‌ ఊహించిన దాని కంటే ఎక్కువ పరుగులు చేయగలిగింది.

ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. మార్క్‌ వుడ్‌ (13), ఆదిల్‌ రషీద్‌ (15) అజేయంగా నిలువగా.. బెయిర్‌స్టో (33), మలాన్‌ (14), బ్రూక్‌ (25), మొయిన్‌ అలీ (11), బట్లర్‌ (43), రూట్‌ (77), లివింగ్‌స్టోన్‌ (20), సామ్‌ కర్రన్‌ (14), క్రిస్‌ వోక్స్‌ (11) ఔటయ్యారు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 3, సాంట్నర్‌, ఫిలిప్స్‌ తలో 2, బౌల్ట్‌, రవీంద్ర చెరో వికెట్‌ దక్కించుకున్నారు.  

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
252 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి సామ్‌ కర్రన్‌ (14) ఔటయ్యాడు.

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
250 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. సాంట్నర్‌ బౌలింగ్‌లో విల్‌ యంగ్‌కు క్యాచ్‌ ఇచ్చి క్రిస్‌ వోక్స్‌ (11) ఔటయ్యాడు.

జో రూట్‌ ఔట్‌.. ఏడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
రివర్స్‌ స్వీప్‌ జో రూట్‌ (77) కొంపముంచింది. ఈ ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా ఈ షాట్లు ఆడి సక్సెస్‌ సాధించిన రూట్‌.. గ్లెన్‌ ఫిలిప్స్‌ బౌలింగ్‌ మరోసారి ఆ ప్రయత్నం చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. అప్పటివరకు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన రూట్‌ అనవసర షాట్‌కు ప్రయత్నించి ఫిలిప్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్‌ 229 పరుగుల వద్ద (41.1 ఓవర్లు) ఏడో వికెట్‌ కోల్పోయింది. సామ్‌ కర్రన్‌, క్రిస్‌ వోక్స్‌ క్రీజ్‌లో ఉన్నారు.

ఆరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
221 పరుగుల వద్ద (38.5 ఓవర్లు) ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన స్లో బాల్‌కు లివింగ్‌స్టోన్‌ (20) ఔటయ్యాడు. జో రూట్‌ (72), సామ్‌ కర్రన్‌ క్రీజ్‌లో ఉన్నారు.

కష్టాల్లో ఇంగ్లండ్‌.. ఐదో వికెట్‌ డౌన్‌
ఇంగ్లండ్‌ టీమ్‌ కష్టాల్లో పడింది. 188 పరుగులకే ఆ జట్టు సగం వికెట్లు (33.2 ఓవర్లలో)బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ టామ్‌ లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి జోస్‌ బట్లర్‌ (43) ఔటయ్యాడు. జో రూట్‌ (59) క్రీజ్‌లో ఉన్నాడు.

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రూట్‌
జో రూట్‌ 57 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 30 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 166/4గా ఉంది. రూట్‌తో పాటు జోస్‌ బట్లర్‌ (30) క్రీజ్‌లో ఉన్నారు.

మొయిన్‌ అలీ క్లీన్‌ బౌల్డ్‌
118 పరుగల వద్ద (21.2 ఓవర్లు) ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ బౌలింగ్‌లో మొయిన్‌ అలీ (11) క్లీన్‌ బౌల్డయ్యాడు. జో రూట్‌ (32) క్రీజ్‌లో ఉన్నాడు.

94 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
వరుసగా 2 బౌండరీలు, ఓ సిక్సర్‌ బాది జోష్‌ మీదుండిన హ్యారీ బ్రూక్‌ (25) అనవసరమైన షాట్‌ ఆడి వికెట్‌ పరేసుకున్నాడు. 17 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 94/3. జో రూట్‌ (20), మొయిన్‌ అలీ క్రీజ్‌లో ఉన్నారు.

జానీ బెయిర్‌స్టో ఔట్‌.. ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ డౌన్‌
64 పరుగుల వద్ద (12.5 ఓవర్లు) ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి జానీ బెయిర్‌స్టో (33) ఔటయ్యాడు. జో రూట్‌ (15), హ్యారీ బ్రూక్‌ క్రీజ్‌లో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
40 పరుగుల వద్ద (7.4 ఓవర్లు) ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న డేవిడ్‌ మలాన్‌ 14 పరుగులు చేసి మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ టామ్‌ లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. జానీ బెయిర్‌స్టో (24) క్రీజ్‌లో ఉన్నాడు.

దూకుడుగా ఆడుతున్న బెయిర్‌స్టో
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఇంగ్లండ్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 35/0గా ఉంది. బెయిర్‌స్టో (21), మలాన్‌ (13) క్రీజ్‌లో ఉన్నారు.

తొలి బంతికే సిక్సర్‌ బాదిన బెయిర్‌స్టో
టాస్‌ ఓడి న్యూజిలాండ్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఊహించని ఆరంభం లభించింది. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో తొలి బంతికే బెయిర్‌స్టో సిక్సర్‌ బాదాడు. ఆతర్వాత ఐదో బంతికి బౌండరీ కొట్టాడు. ఫలితంగా ఇంగ్లండ్‌ తొలి ఓవర్‌లో 12 పరుగులు రాబట్టింది. బెయిర్‌స్టో (11), డేవిడ్‌ మలాన్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో  ఇవాళ (అక్టోబర్‌ 5) డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌- గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టీమ్‌ బెన్‌ స్టోక్స్‌ లేకుండా బరిలోకి దిగుతుండగా.. న్యూజిలాండ్‌ టీమ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సేవలను కోల్పోయింది. విలియమ్సన్‌తో పాటు ఫెర్గూసన్‌, టిమ్‌ సౌథీ, ఐష్‌ సోధి ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. 

న్యూజిలాండ్‌: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/ కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్‌, మాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్

ఇంగ్లండ్‌: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(వికెట్‌కీపర్‌/ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్‌, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

మరిన్ని వార్తలు