World Cup 2023: ఆస్ట్రేలియా-భారత్‌ ఫైనల్‌కు అంపైర్‌లు ఖరారు.. లిస్ట్‌లో ఐరన్‌ లెగ్‌ అంపైర్

17 Nov, 2023 19:13 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 టోర్నీ తుది అంకానికి చేరుకుంది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న తుదిపోరులో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు అంపైర్‌ల జాబితాను ఐసీసీ ప్రకటించింది.

ఫైనల్‌ మ్యాచ్‌కు సీనియర్‌ అంపైర్‌లు రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఇక  థర్డ్ అంపైర్ జోయెల్ విల్సన్, ఫోర్త్‌ అంపైర్‌గా క్రిస్ గఫానీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

జాబితాలో ఐరన్ లెగ్ అంపైర్  
అయితే ఈ లిస్ట్‌లో ఐరన్ లెగ్ అంపైర్  రిచర్డ్ కెటిల్ బరో ఉండడం భారత అభిమానులను ఆందోళన కలిగిస్తోంది. 2014 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి 2023 ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ వ‌ర‌కు రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేసిన మ్యాచుల్లో టీమిండియా గెలవలేదు. ముఖ్యంగా అతడు అంపైరింగ్ చేసిన నాకౌట్‌, ఫైనల్‌ మ్యాచ్‌ల్లో గత 9 ఏళ్ల నుంచి భారత్‌ ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేదు.

బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. ఈ మ్యాచ్‌లో ధోనీ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత 2015 వన్డే ప్రపంచ కప్‌లోనూ భారత్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 95 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి ఇంటి దారిపట్టింది.

అదే విధంగా 2016 టీ20 వరల్డ్‌కప్‌లో జట్టును దురదృష్టం వెంటాడింది. స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్‌.. సెమీస్‌లో వెస్టిండీస్‌ చేతిలో అనుహ్యంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌కూ  కెటిల్ బరోనే అంపైర్‌గా ఉన్నాడు. ఆ తర్వాత అతడు అంపైర్‌గా  వ్యవహరించిన ఛాంపియన్స్‌ ట్రోఫీ-2017 ఫైనల్లోనూ పాక్‌ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. 

ఆ తర్వాత అతడు అంపైరింగ్‌ చేసిన 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లోనూ భారత్‌.. న్యూజిలాండ్ చేతిలో ఓడింది. అంతేకాకుండా వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌-2021, 2023 ఫైనల్స్‌లోనూ భారత్‌ ఓటమి పాలైంది. ఈ రెండు ఫైనల్స్‌కు అతడు థర్డ్‌ అంపైర్‌గా వ్యవహరించాడు. అయితే ఈ సారి కూడా ఫైనల్‌కే ఈ ఐరెన్‌ లెగ్‌ అంపైర్‌ రావడంతో అభిమానులలో ఆందోళన నెలకొంది.
చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాతో ఫైనల్‌.. వక్ర బుద్ధి చూపించిన పాక్‌ క్రికెటర్‌

మరిన్ని వార్తలు