CWC 2023 Final IND VS AUS: మిచెల్‌ మార్ష్‌ అనుచిత ప్రవర్తన...!

20 Nov, 2023 11:41 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ట్రవిస్‌ హెడ్‌ (137) చిరస్మరణీయ శతకంతో 140 కోట్ల భారతీయుల గుండెలను ముక్కలు చేశాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తక్కువ స్కోర్‌కే (240) పరిమితమైనప్పటికీ.. ఆరంభంలో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి గెలుపుపై ఆశలు రేకెత్తించారు.

అయితే హెడ్‌.. లబూషేన్‌ (58 నాటౌట్‌) సహకారంతో భారత్‌కు గెలుపును దూరం చేశాడు. మ్యాచ్‌ అనంతరం ఆసీస్‌ సంబురాలు మినహా నరేంద్ర మోదీ స్టేడియంలో నిశబ్దం ఆవహించింది. ఆసీస్‌ ఆటగాళ్లు తమ జీవితాల్లో అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. హెడ్‌, లబూషేన్‌, మ్యాక్స్‌వెల్‌, కమిన్స్‌ ఇలా.. ప్రతి ఒక్క ఆసీస్‌ ఆటగాడు విజయ గర్వంతో ఊగిపోయారు. అయితే ఒక్క ఆసీస్‌ ఆటగాడి విజయదరహాసం మాత్రం శృతి మించింది. 

2015 ఎడిషన్‌ ఫైనల్లోనూ ఆసీస్‌ గెలుపులో భాగమైన మిచెల్‌ మార్ష్‌ భారత్‌పై విజయానంతరం వరల్డ్‌కప్‌ ట్రోఫీని అగౌరవపరిచాడు. జగజ్జేతగా నిలిచామన్న గర్వంతో అతను మితిమీరి ప్రవర్తించాడు. మ్యాచ్‌ అనంతరం బీర్‌ తాగుతూ వరల్డ్‌కప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టి ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

క్రికెట్‌ అభిమానులు మార్ష్‌ అనుచిత ప్రవర్తనను తప్పుబడుతున్నారు. మతి తప్పినదా ఏంటి అంటూ తూర్పారబెడుతున్నారు. ప్రతి క్రికెటర్‌ ఎంతో అపురూపంగా భావించే వరల్డ్‌కప్‌ ట్రోఫీకి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ మండిపడుతున్నారు. ఎంత గెలిస్తే మాత్రం ఇంత అహం పనికిరాదంటూ గడ్డి పెడుతున్నారు.
 

మరిన్ని వార్తలు