డొక్కు స్కూటర్‌పై మిర్చీ బజ్జీలు అమ్ముతూ.. కోట్లాది మందిని ముంచిన ఘనుడు.. చివరికి అందరూ ఉన్న అనాధలా

19 Nov, 2023 08:12 IST|Sakshi

సహారా అంటే సహాయం, సహారా అంటే సముద్రం. సహారా అంటే ఓ ఎడారి. కానీ మన దేశంలో సహారా అంటే ఓ కంపెనీ. ఆ సంస్థని స్థాపించింది సుబ్రతా రాయ్‌. ఇంటింటికి తిరుగుతూ డొక్కు స్కూటర్‌ మీద మిర్చీ బజ్జీలు అమ్ముకునే స్థాయి లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు. ఇటుక ఇటుక పేర్చి కట్టిన సుబ్రతా రాయ్‌ కార్పొరేట్‌ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది? అపర కుబేరుడిగా అవతరించిన రాయ్‌.. చివరికి అందరూ ఉన్న అనాధలా తలకొరివి పెట్టించుకోలేని దుస్థితికి ఎలా దిగజారారు.  

సహారాలో పనిచేస్తూ జీతం తీసుకునే ఉద్యోగులు, సహారా నుంచి కమీషన్‌ తీసుకునే కమీషన్‌ ఏంజెంట్లు, సహారా కస్టమర్లు సైతం దేవుడు, సహారా శ్రీగా పిలిచే సుబ్రతా రాయ్‌ 1948 బీహార్‌లోని అరారియాలో బెంగాలీ హిందూ సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు ఛబీ, సుధీర్ చంద్ర రాయ్‌లు తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లోని ఢాకా, బిక్రంపూర్‌లో సంపన్న భాగ్యకుల్ జమీందార్ భూస్వామి కుటుంబానికి చెందినవారు.

మిర్చి బజ్జీలు అమ్ముతూ
అయితే, షుగర్‌ ఫ్యాక్టరీలో విధులు నిర్వహించే తండ్రి సుధీర్‌ చంద్ర రాయ్‌ మరణంతో కుటుంబ పోషణ భారం సుబ్రతారాయ్‌ మీద పడింది. దీంతో కుటుంబ పోషణ కోసం ‘జయ ప్రొడక్ట్‌’ పేరుతో మిర్చి బజ్జీలు, పునుగులు, ఇతర తినుబండరాలను భార్య సప్నారాయ్‌ తయారు చేస‍్తే.. డొక్కు లాంబ్రెట్టా స్కూటర్‌ మీద ఇంటింటికి తిరుగుతూ అమ్మేవారు. ఇలా తినుబండారాలే కాకుండా భార్య సప్నారాయ్‌తో మరో వ్యాపారంలో అడుగు పెట్టారు. కానీ ఆ రెండు బిజినెస్‌లు ఫెయిల్‌ అయ్యాయి. 

రెండు బిజినెస్‌లు ఫెయిల్‌
ప్రతి రోజు చెమట చిందిస్తేనే నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లే పరిస‍్థితి మరింత దిగజారడంతో.. ఈజీగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు సుబ్రతా రాయ్‌. అప్పుడే  తన మాటే మంత్రంలా పనిచేసేలా రాయ్‌ మరో బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. ఈసారి గురి కుదిరింది. బిజినెస్‌ నిలబడింది. 30 ఏళ్ల పాటు అప్రతిహితంగా సాగింది. చివరికి సుబ్రతారాయ్‌ చేసిన మోసాలకు ముసుగు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. జైలు జీవితం ఎలా ఉంటుందో నేర్పింది.  

ఇంతకీ ఆ బిజినెస్‌ ఐడియా ఏంటి? 
ఇప్పుడంటే ఎటు చూసినా బ్యాంకులే దర్శనమిస్తున్నాయి. కానీ 1970లలో బ్యాంకులు ఉండేవి కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడంతో బ్యాంక్‌ గురించి, సేవింగ్స్‌ గురించి పెద్దగా తెలిసేదికాదు. ఇక్కడే సుబ్రతరాయ్‌ మాస్టర్‌ మైండ్‌కి ఓ బిజినెస్‌ ఐడియా తట్టింది. 

అదేంటంటే?           
స్థానికంగా ఇంటింటికి తిరుగుతూ స్కూటర్‌ మీద తినుబండరాలు అమ్మే సుబ్రతా రాయ్‌ స్థానికంగా ఉండే టీ స్టాల్ నిర్వాహకులు, రిక్షా నడపుతూ జీవనం కొనసాగించేవారు, తోపుడు బండ్ల మీద చిరు వ్యాపారాలు నిర్వహించే నుంచి తన వ్యాపారాన్ని ప్రారంభించారు. ‘మీరు ఏ పని చేస్తున్నా. వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా మీ దగ్గర ఎంతుంటే అంత బ్యాంక్‌లకు వెళ్లే అవసరం లేకుండా నా దగ్గర దాచండి. దాచిన మొత్తానికి కొంత కాలం తర్వాత అధిక మొత్తం వడ్డీ ఇస్తానని ఆశ చూపించారు. ఇలా ఒక రూపాయి నుంచి పదులు, వందలు ఇలా కొద్ది మొత్తాన్ని దాచుకోవచ్చని చెప్పడంతో వారికి ఇదొక మంచి అవకాశంగా భావించారు. ఈ ప్రచారంతో పల్లెలు, గ్రామాలు, పట్టణాలు, మెట్రో నగరాల్లోని ప్రజలు సహారాలో ఇన్వెస్ట్‌ చేసేందుకు మొగ్గు చూపారు. 

సహారాతో కనెక్టైనా ప్రతి ఒక్కరిని ఎమోషనల్‌గా కట్టి పడేయడం రాయ్‌కి కొట్టిన పింది. కస్టమర్లను, ఏజెంట్లను, ఉద్యోగులను సహారాపరివార్‌ అంటూ తన మాటే మంత్రంలా పనిచేసేలా కట్టిపడేస్తుండేవారు. పైగా పేదలకు పెళ్లిళ్లు చేసి వారు ఆర్ధికంగా నిలబడేలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేవారు. సహారా పరివార్‌ పేరుతో దేశం మొత్తం ప్రచారం చేసేవారు.   

ఆయన చెప్పులు తాకితే జీవితం ధన్యమైనట్లే?
సహారా సంస్థమీద, సుబ్రతా రాయ్‌ మీద నమ్మకాన్ని పెంచేందుకు క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. క్రికెట్‌ను మతంలా భావించే ఇండియన్‌ క్రికెట్‌ టీంకు స్పాన్సర్‌ చేశారు. దీంతో సహారా మీద ప్రజల్లో నమ్మకం మరింత పెరిగింది. డిపాజిట్లు సైతం భారీగా పెరిగాయి. హాస్పిటల్‌ ఖర్చులు, చదువులు, పెళ్లిళ్లలకు సహారాలో డిపాజిట్‌ చేసిన డబ్బులు, వాటి నుంచి వచ్చే వడ్డీ ఉపయోగపడడంతో చాలా మంది సుబ్రతా రాయ్‌ని దేవుడిలా భావించారు. సంస్థ ఉద్యోగులు, కమిషన్‌ ఏంజెట్ల కష్టానికి ప్రతిఫలంగా వేతనాలు ఇవ్వడంతో సుబ్రతారాయ్‌ని సహారా శ్రీగా పిలిచేవారు. ఆయన చెప్పులు తాకితే జీవితం ధన్యం అనేలా ఫిలయ్యేవారనే నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అలా 1978లో రూ.2వేల రూపాయల పెట్టుబడి, ముగ్గురు ఉద్యోగులతో ప్రారంభమైన సహారా 1.13 మిలియన‍్ల మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించింది. 

1997కి సహారా సంస్థ 1 బిలియన్‌ డాలర్ల విలువైన కంపెనీగా అవతరించింది. ఎయిర్‌ సహారా, న్యూయార్క్‌లో లగ్జరీ హోటల్స్‌ కొనుగోలు, భారత్‌లో యాంబీ వ్యాలీ పేరుతో రిసార్ట్‌... ఇలా వాట్‌ నాట్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌, కాలేజీలు, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ను నిర్మించారు. క్రికెట్‌, ఏవియేషన్‌ రంగంలో సైతం అడుగు పెట్టారు. బాలీవుడ్‌ హీరోలు, హీరోయిన్‌లు ఆయనకు అభిమానులుగా మారిపోయారు. 

రూ.550కోట్లతో ఇద్దరు కుమారుల పెళ్లి
సుబ్రాతా రాయ్‌కి  సుశాంతో, సీమంతో రాయ్ ఇద్దరు కుమారులు. 2004 ఉత్తర్‌ ప్రదేశ్‌ లక్నోలో వాళ్లిద్దరి పెళ్లిని రూ. 550 కోట్లతో  నాలుగు రోజుల పాటు నిర్వహించారు. ముఖ్య అతిధుల కోసం ప్రైవేట్ జెట్‌లను ఏర్పాటు చేశాడు సుబ్రతారాయ్‌. కొద్ది మందిని కొంత కాలమే మోసం చేయొచ్చు. ఎక్కువ మందిని ఎక్కువ కాలం మోసం చేయలేరు. సుబ్రతారాయ్‌ చేసిన మోసాలకు ముసుగు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. కొడుకుల పెళ్లితో సుబ్రతా రాయ్‌ జీవనశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి.   

నిరుపేదల సొమ్మును దోచుకునేలా
ఇలా నిరుపేదలు దాచుకున్న మొత్తాన్ని విలాసాలకు ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వెల్లవెత్తాయి. వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. అప్పటి వరకు ప్రజలు డిపాజిట్‌ చేసిన అసలు, వడ్డీని సహారా ఇచ్చేది. రోజులు గడిచే కొద్ది ఆ మొత్తాన్ని ఇవ్వకుండా సహారా గ్రూప్‌లోని ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టేలా వారిని మోటివేట్‌ చేసేవారు. అంతేకాదు అప్పటి వరకు ఏజెంట్లు ఇంటికి వెళ్లి డిపాజిట్లను వసూలు చేసేవారు. కానీ ఇకపై ఏజెంట్లకు ఇంటింటికి తిరగరని మీరే వచ్చి డిపాజిట్‌ చేయాలని  హుకుం జారీ చేశారు. అలా డిపాజిట్‌ చేసేందుకు వీలు లేక కట్టని వారిని స్కీమ్‌ల నుంచి వారి పేర్లను తొలగించేవారు. తొలగించిన వారి డిపాజిట్లను తిరిగి ఇచ్చేది కాదు సహారా గ్రూప్‌.  

సహారా మోసం వెలుగులోకి వచ్చింది అప్పుడే 
అయితే సుదీర్ఘ విరామం తర్వాత  2009లో స్టాక్‌ మార్కెట్లు పుంజుకోవడంతో సహారా ఇండియా గ్రూప్ తన రియల్టీ విభాగం సహారా ప్రైమ్ సిటీ లిమిటెడ్ (ఎస్‌పీసీఎల్‌) ఐపీవోకి వెళుతున్నట్లు సుబ్రతారాయ్‌ ప్రకటించారు. ఆ ప్రకటన సహారాని ఊహించని మలుపు తిప్పింది. ఐపీవోకి వెళ్లాలంటే కంపెనీల వివరాలు లాభాలు, నష్టాలు, వివాదాలన్నింటిని వివరిస్తూ ‘డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్’ను సెబీకి దాఖలు చేయాలి. ఇక్కడే సహారా గ్రూప్‌ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. మొత్తంగా రూ.24,000 కోట్ల కుంబకోణానికి   పాల్పడినట్లు సెబీ గుర్తించింది. 

సుబ్రతా రాయ్‌ని ఇరికించిన రోషన్‌లాల్‌
ఆ తర్వాత కొద్ది రోజులకు డిసెంబర్ 25, 2009న, జనవరి 4, 2010న సెబీకి రెండు ఫిర్యాదులు అందాయి. సహారాకు చెందిన ఈ రెండు (పైన పేర్కొన్న) సంస్థలు కొన్ని బాండ్ల జారీలో చట్టవిరుద్ధమైన మార్గాలను ఉపయోగించాయని ఆరోపించాయి. ఆ ఫిర్యాదు చేసింది మరోవరో కాదు. ఒకరు పెట్టుబడిదారులు సభ్యులు చేస్తే, జనవరి 4, 2010న ఆడిటర్‌ రోషన్‌లాల్‌ చేశారు. ఒకటిన్నర పేజీల్లో హిందీలో రాసిన ఆ లేఖ దేశంలో దుమారాన్నే రేపింది. రోషన్‌ లాల్‌ ఫిర్యాదు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా సెబీకి చేరింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా, సెబీ.. సహారా గ్రూప్ నుండి వివరణలు కోరడం ప్రారంభించింది. 

సంచలనం
సెబీ ప్రశ్నల పరంపరపై రాయ్‌ స్పందిస్తూ ఏకంగా 128 ట్రక్కుల నిండా 31,669 బాక్సుల్లో 3 కోట్ల మంది మదుపర్ల ధరఖాస్తులు, రెండు కోట్ల రిడెంప్షన్‌ వోచర్‌లను సెబీకి పంపారు. దీంతో సెబీ ప్రధాన కార్యాలయం ఉన్న ముంబై శివార్లలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రక్కుల్లో వచ్చిన ఆధారాల్ని సెబీ ఒక గోదామును అద్దెకు తీసుకుని ఆటోమేటెడ్‌ రోబోటిక్‌ సిస్టమ్‌ను వినియోగించి మరీ ఈ పత్రాలను సర్దాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సహారా కేసులో 20 కోట్ల పేజీలను స్కాన్‌ చేసి, ఒక సర్వర్‌లో దాచింది.  

నన్ను ఉరితీసుకోవచ్చు
పలు దఫాలుగా సెబీ దర్యాప్తు చేపట్టిన అనంతరం, కేసు అలహాబాద్‌ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుదాకా వెళ్లింది. తాము ఎటువంటి తప్పు చేయలేదని, హామీ ఇచ్చిన ప్రతిఫలాలతో అందరి డబ్బులను వెనక్కి ఇస్తామని సహారా గ్రూప్‌ చెబుతూ వచ్చింది. అంతేకాదు తన 32 వ్యాపారం రంగంలో ఎన్నడూ న్యాయ నిబంధనలకు వ్యవహరించలేదని, అలా చేస్తే నన్ను ఉరి తీయొచ్చని సుబ్రతారాయ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. 

కేసు నుంచి బయట పడేలా లలిత్‌ మోడీ సాయం
ఇలా 2010 నుంచి ప్రారంభమైన సుబ్రతారాయ్‌ కేసు 2014 మార్చి 4 వరకు కొనసాగింది. మార్చి 4 పోలీసు కస్టడీలో ఉన్న సుబ్రతారాయ్‌ని ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జైల్లో ఉండి కేసు నుంచి బయటపడేందుకు ఆస్తుల్ని అమ్మకానికి పెట్టాడు రాయ్‌. ఇందు కోసం జైలులో వైఫైని ఏర్పాటు చేయాలని కోరారు. ఇక తన ఆస్తుల్ని అమ్మి కేసు నుంచి బయటపడేందుకు సాయం చేయాలని, కార్పొరేట్‌ క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనుడు, పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌లో కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్‌ మోడీని కోరాడు. ఇలా  2014 నుంచి 2016 వరకు తీహార్‌ జైలులో శిక్షను అనుభవించారు. చివరికి 2014 మార్చి 4 బెయిల్‌పై విడుదలయ్యారు.  

కడసారి చూపుకు నోచుకోని 
తాజాగా, సుబ్రతారాయ్‌ అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి 10.30 గంటలకు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో మరణించగా.. గురువారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. కేసులు కారణంగా ఇద్దరు కుమారులు, వేల కోట్ల ఆస్తులు సంపాదించిన రాయ్‌ని కడసారి చూపుకు ఆయన ఇద్దరు కుమారులు సుశాంతో, శ్రీమంతోలు నోచుకోలేదు. చివరికి అందరూ ఉన్న అనాధలా లండన్‌లో చదువుకుంటున్న సుబ్రాతా రాయ్‌ మనవడు 16 ఏళ్ల  హిమాంక్ రాయ్ నేరుగా విమానాశ్రయం నుంచి కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లి తాత భౌతిక కాయానికి  నివాళులర్పించారు. హిమాంక్ రాయ్ చేతుల మీదుగా సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలను నిర్వహించారు.

మరిన్ని వార్తలు