రోహిత్‌, కోహ్లి సరేసరి! ఆ ఇద్దరూ టీమిండియా పాలిట వరం.. బౌలర్ల గురించి చెప్పేదేముంది?!

18 Nov, 2023 12:30 IST|Sakshi

ఇద్దరూ కుడిచేతి వాటం క్రికెటర్లే.. అందులో ఒకరు వికెట్‌ కీపర్‌.. మరొకరు అచ్చమైన బ్యాటర్‌.. ఆ ఇద్దరూ గాయాల నుంచి కోలుకుని సుదీర్ఘ విరామం తర్వాత జట్టులో పునరాగమనం చేసిన వాళ్లే.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023 లాంటి కీలక టోర్నీకి ముందు ఆసియా వన్డే కప్‌-2023 ద్వారా రీఎంట్రీ ఇచ్చారు.

అయితే ఈ ఆసియా టోర్నమెంట్‌తో లభించిన ‘ప్రాక్టీస్‌’ను వికెట్‌ కీపర్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే.. మరో బ్యాటర్‌ మాత్రం గాయం కారణంగా మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. తిరిగొచ్చిన తర్వాత.. ప్రపంచకప్‌ ఆరంభంలోనూ స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడి విమర్శలు మూటగట్టుకున్నాడు.

అయితే, అనూహ్యంగా సెంచరీతో చెలరేగి తిరిగి గాడిలో పడ్డాడు. తనను విమర్శించిన వాళ్లకు బ్యాట్‌తోనే సమాధానమిస్తూ ముందుకు సాగుతున్నాడు. అద్భుత ప్రదర్శనలతో ఈ ఇద్దరూ ఇప్పుడు వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌లో మరింత కీలకంగా మారారు. వాళ్లెవరో కాదు టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్లు శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌.

ఫైనల్‌ వరకు అజేయంగా
స్వదేశంలో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు లీగ్‌ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి టేబుల్‌ టాపర్‌గా సెమీస్‌ చేరింది. న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్‌ గండాన్ని తుదిపోరుకు అర్హత సాధించింది.

అహ్మదాబాద్‌ వేదికగా మిగిలిన ఆ ఇంకొక్క అడుగు విజయవంతంగా పూర్తి చేసి పదేళ్ల ఐసీసీ ట్రోఫీ కరువును తీర్చాలని పట్టుదలగా ఉంది ఈ జెయింట్‌ కిల్లర్‌. ఇక్కడి వరకు సాఫీగా సాగిన టీమిండియా ప్రయాణంలో కెప్టెన్‌ కమ్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, అతడి జోడీ శుబ్‌మన్‌ గిల్‌.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పాత్ర ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

టాపార్డర్‌ జబర్దస్త్‌గా
పవర్‌ ప్లేలో రోహిత్‌ దూకుడుగా ఆరంభిస్తే.. గిల్‌ కాస్త ఆచితూచి ఆడి ఆ తర్వాత వేగం పెంచుతాడు. ఇక వికెట్‌ పడిన తర్వాత క్రీజులోకి వచ్చే కోహ్లి.. తాను పోషించాల్సిన పాత్ర గురించి కచ్చితమైన అవగాహనతోనే మైదానంలో అడుగుపెడతాడన్న సంగతి తెలిసిందే.

అయితే, అన్నివేళలా అన్నీ అనుకున్నట్లుగా జరగవు. టాపార్డర్‌ విఫలమైతే స్కోరు బోర్డును ముందుకు నడిపించగల బాధ్యతను మిడిలార్డర్‌ పూర్తిగా తీసుకోగలగాలి. ఇలాంటపుడే నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌ చేసే బ్యాటర్ల అసలైన ప్రతిభ బయటపడుతుంది.

మిడిలార్డర్‌లో పాతుకుపోయి.. తమకు తామే సాటి అన్నట్లు
వన్డే వరల్డ్‌కప్‌-2023లో తమ పాత్రను చక్కగా పోషిస్తున్నారు శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌. నిజానికి 2015- 19 మధ్య టీమిండియా మిడిలార్డర్‌లో నిలకడలేమి కొట్టొచ్చినట్లు కనిపించేది. అప్పట్లో నంబర్‌ 4లో కీలకమైన అంబటి రాయుడును తప్పించి త్రీడీ ప్లేయర్‌ పేరిట విజయ్‌ శంకర్‌ను ప్రపంచకప్‌-2019 జట్టుకు ఎంపిక చేశారు.

కానీ అనుకున్న ఫలితాలు రాబట్టలేక సెమీస్‌లో ఓటమి చెంది ఇంటి బాట పట్టింది భారత జట్టు. మిడిలార్డర్‌లో అనిశ్చితి కారణంగా భారీ మూల్యమే చెల్లించింది. ఆ తర్వాత రాహుల్‌, అయ్యర్‌ తమ ఆట తీరుతో ఆ లోటు భర్తీ చేసే బాధ్యతను తీసుకున్నారు.

గిల్‌ రాకతో మిడిలార్డర్‌కే పరిమితమైన రాహుల్‌.. వికెట్‌ కీపర్‌గా రాణిస్తూనే బ్యాటర్‌గానూ ఆకట్టుకుంటున్నాడు. వరల్డ్‌కప్‌నకు ముందు తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ కర్ణాటక బ్యాటర్‌.. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో ఫామ్‌లోకి వచ్చాడు.

రాహుల్‌ సైలెంట్‌ కిల్లర్‌
ఆ తర్వాత అతడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముఖ్యంగా వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్‌లో రోహిత్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ డకౌట్లుగా వెనుదిరిగిన వేళ.. కోహ్లి(85)తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్ది జట్టును గెలిపించిన తీరు అద్భుతం.

నాటి మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు రాహుల్‌. ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాటర్‌గా తన వంతు సహకారం అందిస్తున్న ఈ రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌.. వికెట్‌ కీపర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అవును.. వికెట్ల వెనుక కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌లు అందుకోవడం సహా డీఆర్‌ఎస్‌ల విషయంలో కచ్చితత్వంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మను సైతం ఆశ్చర్యపరుస్తున్నాడు. కీలక సమయాల్లో రాహుల్‌ మాటను నమ్మి రోహిత్‌ రివ్యూలో చాలా మటుకు సక్సెస్‌ కావడం ఇందుకు నిదర్శనం.

అయ్యర్‌ అద్భుత బ్యాటర్‌
ఇక శ్రేయస్‌ అయ్యర్‌ విషయానికొస్తే.. దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అజేయ హాఫ్‌ సెంచరీ(53)తో మెరిశాడు. కానీ ఆ తర్వాత నామమాత్రపు స్కోర్లకే పరిమితమై వరుస వైఫల్యాలతో విమర్శల పాలయ్యాడు.

అయితే, శ్రీలంకతో మ్యాచ్‌(82 పరుగులు)లో తిరిగి గాడిలో పడ్డ అయ్యర్‌.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 77 పరుగులు సాధించాడు. ఇక నెదర్లాండ్స్‌లో మ్యాచ్‌లో ఏకంగా 128 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఆ తర్వాత సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో సొంతమైదానం వాంఖడేలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 70 బంతుల్లో 105 పరుగులు చేసి వరల్డ్‌కప్‌ నాకౌట్‌ దశలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ సైతం 20 బంతుల్లో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇలా వీరిద్దరు మిడిలార్డర్‌లో నిలకడగా రాణిస్తుండటం టీమిండియా పాలిట వరంలా మారింది. కీలకమైన నాలుగు, ఐదు స్థానాల్లో అయ్యర్‌, రాహుల్‌ సక్సెస్‌ అవుతుండటంతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ మునుపెన్నడూ లేని విధంగా మరింత పటిష్టంగా కనిపిస్తోంది.

ప్రతి మ్యాచ్‌లో 10 వికెట్లు
టీమిండియా విజయాల్లో బ్యాటర్ల సంగతి ఇలా ఉంటే.. బౌలింగ్‌ విభాగం ముఖ్యంగా పేస్‌ త్రయం జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుమ్రా, సిరాజ్‌ వరుస అవకాశాలు దక్కించుకుంటే.. లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా షమీ ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం.

షమీ బుల్లెట్‌
ఇప్పటి వరకు మూడు ఐదు వికెట్ల హాల్స్‌ నమోదు చేసి మొత్తంగా 23 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ప్రస్తుతం అ‍గ్రస్థానంలో కొనసాగుతున్నాడు షమీ.

ఇక బుమ్రా 18, సిరాజ్‌ 13 వికెట్లతో వరుసగా ఆరు, పద్దెనిమిది స్థానాల్లో ఉన్నారు. అదే విధంగా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌ సైతం తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లన్నిటిలో ఏకంగా 10 వికెట్లు తీయడాన్ని బట్టి మన బౌలర్ల ప్రదర్శన ఎలా ఉందో చెప్పవచ్చు.

కోహ్లి టాప్‌ గన్‌
ఇదిలా ఉంటే.. టాప్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో.. 711 పరుగులతో కోహ్లి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇక రోహిత్‌ శర్మ 550 రన్స్‌తో ఐదు, శ్రేయస్‌ అయ్యర్‌ 526 పరుగులతో ఏడు, కేఎల్‌ రాహుల్‌ 386 పరుగులతో పద్నాలుగవ స్థానాల్లో ఉన్నారు. 

మరిన్ని వార్తలు