CWC 2023 Semis: వారి అత్యుత్సాహం వల్ల.. నాడు అలా టీమిండియాకు భంగ‌పాటు!

14 Nov, 2023 20:23 IST|Sakshi

రెండు అడుగులు.. రెండే రెండు అడుగులు దాటితే చాలు.. వరల్డ్ కప్ టైటిల్  మరోసారి టీమిండియా సొంతమవుతుంది. పుష్కరకాలం తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడే అవకాశం భారత జట్టుకు లభిస్తుంది. సొంత గడ్డ మీద‌ 2011లో ధోని సేన చేసిన అద్భుతం పునరావృతం అవుతుంది.

వన్డే వరల్డ్ కప్ 2023లో సెమీఫైనల్ వరకు రోహిత్ సేన కొనసాగించిన జైత్ర‌యాత్ర ప‌రిపూర్ణం అవుతుంది. ఇప్పటివరకు 12 వన్డే వరల్డ్ కప్ టోర్నీలలో టీమిండియా ఏడుసార్లు సెమీఫైనల్ చేరుకుంది. 1983, 1987, 2003, 2011, 2015, 2019 ఎడిషన్లలో ఆడింది. ఇందులో మూడుసార్లు గెలిచి.. నాలుగుసార్లు ఓటమిపాలైంది.

ఎలాంటి అంచనాలు లేకుండా 1983 వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన భారత జట్టు సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ ను ఆరు వికెట్ల తేడాతోచిత్తు చేసింది. ఆ తర్వాత ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ కు ఊహించని షాక్ ఇచ్చి జ‌గ‌జ్జేత‌గా అవతరించింది. అలా తొలిసారి సెమీస్ గండాన్ని దాటేసి ట్రోఫీని ముద్దాడింది కపిల్ డెవిల్స్.

అయితే.. 1987 ఎడిషన్ లో మాత్రం సొంత గడ్డపై సెమీఫైనల్ లో ఓటమిపాలైంది. వాంకడే వేదికగా ఇంగ్లాండ్ చేతిలో ఓడి సెమిస్లోనే నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బ‌రిలోకి దిగిన భార‌త్‌ 35 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది.

ఆ తర్వాత 1992 వరల్డ్ కప్ లోను మరోసారి ఇంగ్లాండ్ చేతిలో ప‌రాజ‌యం పాలై చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. నాడు టీమిండియాని ముందుండి నడిపించింది మహమ్మద్ అజారుద్దీన్.

ఇక 1996 సెమీఫైనల్ లో చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ లో భారత జట్టుకు శ్రీలంక చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది. అభిమానుల అత్యుత్సాహం వల్ల మ్యాచ్ కు  కలిగిన అంతరాయం టీమిండియా కొంపముంచింది.

నాడు లంక నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా.. 34 ఓవర్ల వద్ద 120/8 స్కోరుతో కొనసాగుతున్న సమయంలో.. స్టేడియంలోని ఫ్యాన్స్ హంగామా చేశారు.

దీంతో ఆట ముందుకు సాగలేదు. ఈ క్రమంలో అప్పటికి భారత్ పై పై చేయి సాధించిన శ్రీలంకను అంపైర్లు విజేతగా ప్రకటించారు. అలా అజారుద్దీన్ సార‌థ్యంలోని టీమిండియా పై నెగ్గిన శ్రీలంక ఫైనల్ లోను విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.

వన్డే వరల్డ్ కప్ టోర్నీ 2003 లో భారత జట్టు ప్రయాణం అద్భుతంగా సాగింది. స్టార్ ఆటగాళ్లంతా నిలకడైన ఫామ్ తో జట్టును ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు.

బ్యాటర్లు బౌలర్లు సమష్టిగా రాణించి జట్టును సెమీస్కు చేర్చారు. నాడు ఊహించని రీతిలో సెమీస్కు వచ్చిన కెన్యాపై ఘన విజయం సాధించి సగర్వంగా ఫైన‌ల్లో అడుగుపెట్టింది టీమిండియా.

కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చెంది ర‌న్న‌ర‌ప్‌తో పెట్టుకుంది. ఇక 2011 వరల్డ్ కప్ గురించి టీమిండియా అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని జట్టు భారత్ ను రెండోసారి జ‌గ‌జ్జేత‌గా నిలిపింది.

సెమీఫైనల్ లో పాకిస్తాన్ ను మట్టి కరిపించి ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించిన‌ ధోని సేన.. ఆఖరిమెట్టుపై శ్రీలంకను ఓడించి ఛాంపియన్గా అవతరించింది. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు ఐసీసీ ట్రోఫీని బహుమతిగా అందించింది.

వన్డే వరల్డ్ కప్ 2015 సెమీఫైనల్ లో భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో దారుణ వైఫల్యంతో ఇంటి బాట పట్టింది. అదేవిధంగా 2019 లోను భంగపాటుకు గురైంది. వర్షం కారణంగా రెండు రోజులపాటు జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. నాటి మ్యాచ్లో ఫినిషర్ ధోని రన్ అవుట్ రనౌట్ కావడం టీమిండియా అవకాశాలను దెబ్బతీసింది. చివరి వరకు పోరాడినా 18 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.

మరిన్ని వార్తలు