పిఠాపురం సమన్వయ భేటీలో పవన్‌కు ఘోర అవమానం?.. రచ్చ రచ్చ

14 Nov, 2023 20:39 IST|Sakshi

సాక్షి, కాకినాడ: పొత్తు సంగతేమోగానీ.. తెలుగు దేశం జనసేన ఎన్నికల దాకా కలిసి సాగుతాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం.. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల కేడర్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండడం. అందుకే  సమన్వయం కోసం ఇరుపార్టీల మధ్య భేటీలు నిర్వహిస్తున్నారు. కానీ ఈ భేటీల్లోనే గొడవలు బయటపడుతున్నాయి. తాజాగా పిఠాపురంలో నిర్వహించిన భేటీ అయితే ఏకంగా ఉద్రిక్తతకే దారి తీసింది. 

పాత టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన రెండు పార్టీల సమస్వయ కమీటీ సమావేశం రచ్చ రచ్చ అయ్యింది. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ ఓడిపోయిన నేపథ్యంలో.. ఈసారి సీటు తనకు ఇవ్వాలన్న నియోజకవర్గ జనసేన ఇంఛార్జి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కోరారు. ఆ సమయంలో వర్మ కలుగ జేసుకుని.. మహామహులే గత ఎన్నికల్లో ఓడిపోయారంటూ వ్యాఖ్యానించారు. 

దీంతో పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించే వర్మ వ్యాఖ్యానించారని, తమ అధినేతను వర్మ అవమానించారని మండిపడ్డారు జనసైనికులు. జనసేన-టీడీపీ నేతల పరస్పర దూషణలతో, గలాటతో కుర్చీలు, బెంచీలను పడేయడంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. చివరకు ఇరు పార్టీల నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. వాళ్ల మాటలు పట్టించుకోకుండా కార్యకర్తలంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

మరిన్ని వార్తలు