CWC 2023: సచిన్‌ రికార్డు సమం చేసిన విరాట్‌.. అయితే ఎవరికి గొప్ప అన్నట్లు ప్రవర్తించిన శ్రీలంక కెప్టెన్‌

6 Nov, 2023 11:23 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 49వ వన్డే శతకాన్ని సాధించి, క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును (49 సెంచరీలు) సమం చేసిన విషయం తెలిసిందే. విరాట్‌ సాధించిన ఈ ఘనతను యావత్‌ క్రీడా ప్రపంచం కీర్తిస్తుంది. రికార్డుల రారాజుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విరాట్‌ నామస్మరణతో సోషల్‌మీడియా మార్మోగిపోతుంది. 

అయితే ఓ అంతర్జాతీయ ఆటగాడు విరాట్‌ సాధిం​చిన ఘనతను అభినందించేందుకు నిరాకరించి, నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారాడు. వివరాల్లోకి వెళితే.. వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ఇవాళ శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీలంక కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ విలేకరి విరాట్‌ రికార్డు శతకంపై కుశాల్‌ను ఇలా ప్రశ్నించాడు. 

విరాట్‌ 49వ వన్డే సెంచరీ సాధించి, సచిన్‌ రికార్డు సమం చేసినందుకు మీరు అభినందనలు తెలిపాలని అనుకుంటున్నారా అని అడిగాడు. అందుకు కుశాల్‌ నేనెందుకు అతన్ని అభినందిస్తానంటూ షాకింగ్‌ సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి పంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇది చూసి క్రికెట్‌ అభిమానులు కుశాల్‌ను ఏకి పారేస్తున్నారు.

కుశాల్‌ను సంస్కారహీనుడని దుమ్మెత్తిపోస్తున్నారు. కనీస మర్యాద కూడా లేని వ్యక్తిని శ్రీలంక క్రికెట్‌ బోర్డు కెప్టెన్‌గా ఎలా నియమించిందని మండిపడుతున్నారు. మైదానంలో ఎంతటి వైరం ఉన్నా, సహచర ఆటగాడు సాధించిన ఇంతటి ఘనతను ఎవరైనా అభినందిస్తారని అంటున్నారు. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో శ్రీలంక రెగ్యులర్‌ కెప్టెన్‌ దసున్‌ షనక గాయపడటంతో కుశాల్‌ మెండిస్‌ను అనూహ్యంగా కెప్టెన్‌ పదవి వరించింది. 
 

మరిన్ని వార్తలు