CWC 2023 IND Vs SL: వైరలవుతున్న షమీ సెలబ్రేషన్స్‌.. హర్భజన్‌ను ఉద్దేశించి కాదు..!

3 Nov, 2023 10:58 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా శ్రీలంకతో నిన్న (నవంబర్‌ 2) జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్‌ షమీ (5-1-18-5) అదిరిపోయే ఐదు వికెట్ల ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ ఐదు వికెట్ల ప్రదర్శనతో పలు రికార్డులు కొల్లగొట్టిన షమీ.. ఈ ఘనత సాధించిన అనంతరం వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో షమీ తన ఐదో వికెట్‌ సాధించగానే బంతి తలపై రుద్దుకుంటూ డ్రెస్సింగ్‌ రూమ్‌వైపు సైగలు చేశాడు. తన ప్రదర్శన ఎవరికో అంకితం ఇస్తున్నట్లుగా షమీ సైగలు ఉన్నాయి.

ఈ ప్రదర్శనతో షమీ హర్భజన్‌ సింగ్‌ రికార్డును (వన్డేల్లో భారత్‌ తరఫున అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనత) బ్రేక్‌ చేయడంతో భజ్జీని ఉద్దేశించే ఈ సైగలు చేశాడని అంతా అనుకున్నారు. హిందీ వ్యాఖ్యాతలు సైతం ఇదే అన్నారు. అయితే మ్యాచ్‌ అనంతరం షమీ తాను చేసుకున్న సెలబ్రేషన్స్‌పై వివరణ ఇచ్చాడు. తాను సైగలు చేసింది భజ్జీని ఉద్దేశించి కాదని తేల్చి చెప్పాడు. 

తన కెరీర్‌ ఎత్తుపల్లాల్లో అండగా నిలిచి, తాను స్కిల్స్‌ డెవలప్‌ చేసుకోవడంలో సాయపడిన టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ పరస్‌ మాంబ్రేను ఉద్దేశించి సదరు సంబురాలు చేసుకున్నానని వివరణ ఇచ్చాడు. తన ఐదు వికెట్ల ప్రదర్శనను మాంబ్రేకు అంకితం ఇస్తున్నాని చెప్పడానికి అలా సైగలు చేశానని తెలిపాడు. మాంబ్రేకు తలపై జట్టు ఉండదు కాబట్టి, అలా సైగలు చేశానని చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని మ్యాచ్‌ అనంతరం శుభ్‌మన్‌ గిల్‌ కూడా చెప్పాడు.

కాగా, లంకపై ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన షమీ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇందులో వరల్డ్‌కప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు (14 మ్యాచ్‌ల్లో 45) ప్రధానమైంది కాగా.. వన్డేల్లో భారత్‌ తరఫున అత్యధికసార్లు (4) ఐదు వికెట్ల ఘనత, వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు (3) ఐదు వికెట్ల ఘనత, వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు (7) నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనత వంటి పలు ఇతర రికార్డులు కూడా ఉన్నాయి.  

ఇదిలా ఉంటే, వాంఖడే వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్‌ అధికారికంగా సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. గిల్‌ (92), కోహ్లి (88), శ్రేయస్‌ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్‌ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్‌ షమీ (5-1-18-5), మొహమ్మద్‌ సిరాజ్‌ (7-2-16-3), జస్ప్రీత్‌ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్‌ రజిత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.


 

మరిన్ని వార్తలు