బాల్‌ టాంపరింగ్‌: ఇక్కడితో ఆగిపోయేలా లేదు

16 May, 2021 20:27 IST|Sakshi

సిడ్నీ: 2018లో ఆసీస్‌ క్రికెటర్లు చేసిన బాల్‌ టాంపరింగ్‌  క్రికెట్‌లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో బాన్‌క్రాఫ్ట్‌ బంతికి స్యాండ్‌ పేపర్‌ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)... బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు... కెప్టెన్‌ స్మిత్, వైస్‌ కెప్టెన్‌ వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది.


తాజాగా బాన్‌క్రాఫ్ట్‌..  బాల్‌ టాంపరింగ్‌ విషయం స్మిత్‌, వార్నర్‌లతో పాటు మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ పెద్ద బాంబు పేల్చాడు. దీంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) బాన్‌క్రాఫ్ట్‌ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని మరోసారి విచారణకు సిద్ధమైంది. బాన్‌క్రాఫ్ట్‌ చెప్పినట్లు ఇతర బౌలర్లకు కూడా ఈ విషయం ముందుగానే తెలుసా అనే కోణంలో విచారణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బాల్ టాంపరింగ్‌ వివాదం ఇంకా ముగిసిపోలేదని..అది బాన్‌క్రాఫ్ట్‌తో ఆగిపోదని.. ఇంకా ముందుకు సాగుతుందని ఆసీస్‌ మాజీ బౌలింగ్‌ కోచ్‌ డేవిడ్‌ సాకర్‌ పేర్కొన్నాడు.

ఆసీస్‌ ప్లేయర్లు బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన సమయంలో ఆసీస్‌ బౌలింగ్‌ కోచ్‌గా డేవిడ్‌ సాకర్‌ ఉండడం విశేషం. డేవిడ్‌ సాకర్‌ స్పందిస్తూ.. ''ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ వివాదం చాలా మందిని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. అది నేనైనా కావొచ్చు లేదా ఇంకెవరో కావొచ్చు. బాన్‌క్రాఫ్ట్‌ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని సీఏ విచారణ చేపట్టడం మంచిదే కావొచ్చు.. కానీ తప్పు చేయనివాళ్లు కూడా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విచారణలో భాగంగా రేపు నన్ను పాయింట్‌ అవుట్‌ చేయొచ్చు.. లేదంటే ఆ సమయంలో కోచ్‌గా ఉన్న డారెన్‌ లీమన్‌వైపు కూడా వెళ్లొచ్చు. ఈ విచారణతో వాళ్లు(సీఏ) ఎక్కడిదాకా వెళతారో నాకు తెలియదు.. ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఇది బాన్‌క్రాఫ్ట్‌తో ముగిసిపోలేదు.. ఇది ఎప్పటికి ఆగిపోదు.. ముందుకు సాగుతూనే ఉంటుంది.'' అని చెప్పుకొచ్చాడు.  
చదవండి: బాల్‌ ట్యాంపరింగ్‌ చేస్తున్నానని వారికీ తెలుసు

అతనికి బౌలింగ్‌ చేస్తే.. అమ్మాయిని ఇంప్రెస్‌ చేసినట్లే

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు