బాల్‌ కోసం వెయిట్‌ చేస్తూ ప్రాణాలతో చెలగాటం

17 Oct, 2020 23:58 IST|Sakshi

షార్జా:  రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ పించ్‌ హిట్టర్‌ ఏబీ డివిలియర్స్‌ ధాటికి బౌండరీలు కూడా చిన్నబోయాయి. 22 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లతో అజేయంగా 55 పరుగులు సాధించి మరొకసారి ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. శనివారం డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌ల్లో భాగంగా తొలుత  ఒక మంచి మజా మ్యాచ్‌ చూసిన తర్వాత సీఎస్‌కే-ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ కూడా అంతే ఆసక్తికరంగానే సాగింది. చివరి ఓవర్‌ వరకూ వచ్చిన ఆ మ్యాచ్‌లో ఢిల్లీ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. ఢిల్లీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బ్యాట్‌ ఝుళిపించి ఆ జట్టుకు ఘనమైన విజయాన్ని అందించాడు. 

ఢిల్లీలోని మిగతా టాపార్డర్‌ ఆటగాళ్లు తడబడ్డ చోట ధావన్‌ మెరిశాడు. తాను ఎప్పుడూ క్లాస్‌ ఆటగాడననే చెప్పుకునే ధావన్‌.. ఒక మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 101 పరుగులు సాధించి గెలుపులో కీలక పాత్ర పోషించాడు.   ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన సమయంలో ఆ బాధ్యతను అక్షర్‌ తీసుకున్నాడు. జడేజా వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతికి ధావన్‌ సింగిల్‌ తీయగా,  అక్షర్‌ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను తమవైపుకు తిప్పుకున్నాడు.  ఇక నాల్గో బంతికి రెండు పరుగులు తీసిన అక్షర్‌.. ఐదో బంతికి మరో సిక్స్‌ కొట్టి ఢిల్లీని గెలిపించాడు. ధావన్‌ సెంచరీకి అక్షర్‌ మంచి ఫినిషింగ్‌ ఇవ్వడంతో ఢిల్లీ ఇంకా బంతి ఉండగా విజయం సాధించింది. అక్షర్‌ 5 బంతుల్లో అజేయంగా 21 పరుగులు సాధించడంతో అప‍్పటివరకూ సీఎస్‌కే వైపు ఉన్న మ్యాచ్‌  కాస్తా ఢిల్లీ ఎగురేసుకుపోయింది.

బాల్‌ కోసం ప్రాణాలతో చెలగాటం..
సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఒక విషయం కచ్చితంగా చెప్పుకోవాలి. జడేజా క్రీజ్‌లోకి రాకముందు- వచ్చిన తర్వాత అనే విషయాన్ని ప్రస్తావించక తప్పదు. జడేజా వచ్చిన తర్వాత సీఎస్‌కే ఇన్నింగ్స్‌ పరుగులు తీసింది. జడేజా కొట్టిన నాలుగు సిక్స్‌లతో సీఎస్‌కే స్కోరు బోర్డు ఈజీగా 170 పరుగుల మార్కును దాటేసింది. అయితే జడేజా కొట్టిన ఒక సిక్స్‌ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. సిక్స్‌లు కొట్టడం, అవి స్టేడియాలు దాటడాన్ని కామన్‌గా చూస్తున్నాం. కానీ ఆ సిక్స్‌ రోడ్డుపై పడటం ఒకటైతే,  ఆ బంతిని తీయడానికి ఒక అభిమాని రిస్క్‌ చేయడం కెమెరాల్లో రికార్డయ్యింది. బంతి కోసం గ్రౌండ్‌ బయట వేచి చూస్తున్న సదరు అభిమాని రోడ్డు మధ్యలోకి పరుగెత్తి దాన్ని తీయడం కామెంటేటర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. తొలుత అతని డేరింగ్‌ను మెచ్చుకున్నప్పటికీ వీకెండ్‌లో అలా రోడ్డు మధ్యలోకి రావడం చాలా రిస్క్‌ అని కామెంటేటర్‌ సైమన్‌ డౌల్‌ అన్నారు. అసలు వీకెండ్‌లో రోడ్డుపై తనకు పరుగెత్తే అవకాశమే ఉండదంటూ అది ఎంత ప‍్రమాదకరమో అనే విషయాన్ని పరోక్షంగా చెప్పారు. బంతిని ఇంటికి తీసుకెళ్లడం కోసం  ఇలా ఫ్యాన్స్‌ బయట వేచి చేయడం ఈ ఐపీఎల్‌లో చర‍్చనీయాంశమైంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే జట్టులో సామ్‌ కరాన్‌,ధోనిలు మినహా అంతా రాణించారు. డుప్లెసిస్‌ 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు, వాట్సన్‌ 28 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు, రాయుడు 25 బంతుల్లో 1ఫోర్‌, 4 సిక్స్‌లతో 45 నాటౌట్‌, రవీంద్ర జడేజా 13 బంతుల్లో 4 సిక్స్‌లతో 33 నాటౌట్‌లు తలో చేయి వేసి సీఎస్‌కే 179 పరుగులు చేయడంలో సహకరించారు. 

>
మరిన్ని వార్తలు