Ravindra Jadeja: జడేజా ఆసక్తికర ట్వీట్‌; నెటిజన్ల ఆగ్రహం

23 Jul, 2021 10:49 IST|Sakshi

లండన్‌: టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గురువారం తమ సంస్కృతికి సంబంధించి ట్విటర్‌లో షేర్‌ చేసిన విషయం ఆసక్తికరంగా మారింది. క్రికెట్‌లో జడేజా సెంచరీ, అర్థసెంచరీ లేదా ఏదైనా మైల్‌స్టోన్‌ సాధించినప్పుడు తన బ్యాట్‌ను ఖడ్గంలా తిప్పడం చాలాసార్లే చూసి ఉంటాం. స్వతహాగా రాజ్‌పుత్‌ వంశీయులు తమ ఆచారంలో భాగంగా వేడుకల్లో ఖడ్గాన్ని తిప్పడం చూస్తుంటాం. జడేజా కూడా తమ సంస్కృతిలో భాగంగానే తమ సంప్రదాయాన్ని గుర్తుచేసుకుంటానని చాలాసార్లు చెప్పుకొచ్చాడు.

అయితే తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2021 సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా బుధవారం కామెంటేటరీ సమయంలో ''నేను బ్రాహ్మిణ్‌నే'' అంటూ కామెంట్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. రైనా తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రైనాకు మద్దతుగా జడేజా ట్వీట్‌ ఉన్నట్లు అర్థమవుతుంది. '' ఐయామ్‌ జడేజా.. రాజ్‌పుత్‌ బాయ్‌ ఫర్‌ఎవర్‌.. జై హింద్‌'' అంటూ జడేజా ట్వీట్‌ చేశాడు.

అయితే నెటిజన్లు మాత్రం జడేజాను ఏకిపారేశారు. '' ఒక ఆటగాడిగా మీరు ఎంతోమందికి ఆదర్శం. మీలాంటి వ్యక్తి నుంచి ఇలాంటివి మేము ఊహించలేదు. మతం, కులం, రంగు ఇవి మనకు ముఖ్యం కాదు.. ఒక రాజ్‌పుత్‌ అని చెప్పుకోవడం మంచి విషయమే.. కానీ ఒక హూమన్‌ యాంగిల్‌లో ఇలాంటి ట్వీట్స్‌ చేయడం తప్పు.. వ్యక్తులను వర్గాలుగా చూడడం కంటే సాటి మనిషిగా గౌరవిస్తే మంచిది.. ముందు మనం భారతీయులు.. ఆ తర్వాత ఈ కులాలు, మతాలు వచ్చాయి'' అంటూ కామెంట్లు చేశారు. కాగా ప్రస్తుతం జడేజా ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి జరగనుంది. కాగా కౌంటీ ఎలెవెన్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో జడేజా అర్థసెంచరీతో పాటు బంతితోనూ వికెట్లు తీసి మెరిశాడు.

>
మరిన్ని వార్తలు