FIFA World Cup 2022: నాకౌట్‌కు చేరే అవకాశాలు ఆ రెండు జట్లకే..!

12 Nov, 2022 07:16 IST|Sakshi

ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా గ్రూప్‌ ‘ఎ’లో ఆతిథ్య ఖతర్‌తో పాటు నెదర్లాండ్స్, సెనెగల్, ఈక్వెడార్‌లు పోటీ పడుతున్నప్పటికీ నాకౌట్‌ అవకాశాలు డచ్, సెనెగల్‌ జట్లకే ఉన్నాయి. ఆసియా చాంపియన్‌ ఖతర్‌ ఆ రెండు జట్లను మించి నాకౌట్‌కు చేరడం అంత సులువేమీ కాదు. అయితే ఘనమైన ఆతిథ్యంతో పాటు టోర్నీలో చక్కని ప్రదర్శనతో ఆకట్టుకోవాలనే లక్ష్యంతో ఖతర్‌ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరి బలాబలాలేంటో పరిశీలిద్దాం 
ఖతర్‌ 
ప్రపంచకప్‌ అత్యుత్తమ ప్రదర్శన: ఇదే తొలిసారి 
ఇతర ఘనతలు: ఆసియా కప్‌ విజేత (2019) 
ఫిఫా ర్యాంకు: 50 
అర్హత: ఆతిథ్య హక్కులతో నేరుగా 
సాకర్‌ వరల్డ్‌కప్‌ ఆతిథ్యం కోసం ఖతర్‌ ప్రభుత్వం, పాలకులు తెరముందు, తెరవెనుక ఎంతో చేశారు. అయితే ఖతర్‌ ఫుట్‌బాల్‌ జట్టు కోసం అహర్నిశలు కృషిచేసింది మాత్రం కోచ్‌ ఫెలిక్స్‌ సాంచెజ్‌ మాత్రమే! స్పానిష్‌కు చెందిన 46 ఏళ్ల కోచ్‌ కృషి వల్లే 2019లో ఖతర్‌ ఆసియా కప్‌ సాధించింది. 2006 నుంచి ఆయన జట్టును సానబెడుతూ వచ్చారు. ఈ జట్టులో అక్రమ్‌ అఫిఫ్‌ కీలక ఆటగాడు. నిలకడైన ప్రదర్శనతో రాణిస్తున్నాడు. 

నెదర్లాండ్స్‌ 
ప్రపంచకప్‌ అత్యుత్తమ ప్రదర్శన: మూడు సార్లు రన్నరప్‌ (1974, 1978, 2010) 
ఇతర ఘనతలు: యూరోపియన్‌ చాంపియన్‌ (1988) 
ఫిఫా ర్యాంకు: 8 
అర్హత: యూరోపియన్‌ క్వాలిఫయింగ్‌లో తొలిస్థానం 
ఈ గ్రూపులో మేటి జట్టు నెదర్లాండ్స్‌. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉంది. యూరోపియన్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో గ్రూప్‌–జిలో అగ్ర స్థానంతో మెగా ఈవెంట్‌కు అర్హత పొందింది. మిడ్‌ఫీల్డర్‌ ఫ్రెంకీ డి జాంగ్‌ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. డిఫెండర్లలో డేలి బ్లిండ్, స్టీఫన్‌ డి రిజ్‌ ప్రత్యర్థి స్ట్రయికర్లను చక్కగా నిలువరిస్తున్నారు. దీంతో ఈ సారి ఫైనల్‌ చేరితే మాత్రం కప్‌ను చేజార్చుకునే ప్రసక్తే లేదనే లక్ష్యంతో ఉంది.   

సెనెగల్‌  
ప్రపంచకప్‌ అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్స్‌ (2002) 
ఇతర ఘనతలు: ఆఫ్రికన్‌ చాంపియన్స్‌ (2022) 
ఫిఫా ర్యాంకు: 18 
అర్హత: ప్లే–ఆఫ్స్‌లో ఈజిప్టును ఓడించి ఈ గ్రూపు నుంచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరే అర్హత ఉన్న రెండో జట్టు సెనెగల్‌. ఈ ఏడాది ఆఫ్రికన్‌ చాంపియన్‌గా నిలిచింది. స్టార్‌ డిఫెండర్‌ కలిడో కలిబేలి సారథ్యంలోని సెనెగల్‌ ఈసారి మెరుగైన ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఉంది. మిడ్‌ఫీల్డర్లలో ఇడ్రిసా గుయె, పేప్‌ గుయె, ఫార్వర్డ్‌లో బౌలయె డియా, హబిబ్‌ డైయలోలు కూడా స్థిరంగా రా>ణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ప్రిక్వార్టర్స్‌ లక్ష్యంగా పెట్టుకున్న సెనెగల్‌ 20 ఏళ్ల క్రితంనాటి క్వార్టర్‌ ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలనుకుంటుంది. 

ఈక్వెడార్‌ 
ప్రపంచకప్‌ అత్యుత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్స్‌ (2006); ఫిఫా ర్యాంకు: 44   
ఇతర ఘనతలు: కోపా అమెరికా కప్‌లో నాలుగో స్థానం (1959, 1993) 
అర్హత: దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్‌లో నాలుగో స్థానం 
నెదర్లాండ్స్, సెనెగల్‌లతో కనీసం డ్రాతో గట్టెక్కినా అది ఈక్వెడార్‌ గొప్ప ప్రదర్శనే అవుతుంది. సంచలనాలు నమోదైతే తప్ప నాకౌట్‌ చేరడం కష్టం. అర్జెంటీనాకు చెందిన కోచ్‌ గుస్తావో అల్ఫారోకు అక్కడి క్లబ్‌ జట్లను తీర్చిదిద్దిన అనుభవంతో 2020లో ఈక్వెడార్‌ కోచింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌ ఎన్నెర్‌ వాలెన్సియా ఈక్వెడార్‌ తురుపుముక్క. మేజర్‌ ఈవెంట్లలో 35 గోల్స్‌తో ఈక్వెడార్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఫుట్‌బాలర్లలో ఒకడిగా నిలిచాడు. –సాక్షి క్రీడావిభాగం     

మరిన్ని వార్తలు