టీ–20ల్లో ఏ రోజు ఆట ఆ రోజుదే: రుతురాజ్‌ గైక్వాడ్‌

16 Jun, 2022 08:23 IST|Sakshi
మాట్లాడుతున్న రుతురాజ్‌ గైక్వాడ్‌

విశాఖ స్పోర్ట్స్‌: దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భాగంగా కీలకమైన మ్యాచ్‌లో రాణించి భారత జట్టు విజయం సాధించడంలో ముఖ్యపాత్ర వహించాడు రుతురాజ్‌ గైక్వాడ్‌. వైఎస్సార్‌ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ–20 మ్యాచ్‌ పవర్‌ ప్లేలోనే తొలి వికెట్‌ భాగస్వామ్యం బలంగా పడటంతో కంగారెత్తింది ఆహ్వాన జట్టు. ఓపెనర్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ ఆరు మ్యాచ్‌లే ఆడినా తన అత్యధిక స్కోర్‌ 57 (35 బంతుల్లోనే ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు)ను విశాఖలోనే నమోదు చేశాడు. మ్యాచ్‌ అనంతరం ఆయనతో ‘సాక్షి’ మాట్లాడింది. ఏ రోజుకు ఆ రోజు ప్రణాళిక బద్ధంగా ఆటకు సిద్ధమవుతామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.  

సాక్షి: విశాఖలో జరిగిన రెండు టీ 20 మ్యాచ్‌ల్లో టాస్‌ గెలిచిన జట్టే విజయం సాధించింది. ఇప్పుడు టాస్‌ ఓడిన జట్టు గెలిచింది. దీనిపై మీరు ఏమంటారు?  
గైక్వాడ్‌: కాయిన్‌ అలా దొర్లుకుంటూ వెళుతూ వెళుతూ ఓ చోట అటో ఇటో పడిపోతుంది. దానిని మనం నియంత్రించలేం. అది ఎవరికి ఫేవర్‌ అయినా కావచ్చు. కానీ ఆటలో అది కేవలం ఒక భాగమే. ఏ రోజు ఆట ఆ రోజు పిచ్‌కు అనుగుణంగా ప్రణాళిక ఉంటుంది. దాని ప్రకారమే జట్టు ఆడుతుంది. అంతే తప్ప టాస్‌ ప్రధాన పాత్ర పోషిస్తుందని నేను నమ్మను. జట్టూ నమ్మదు. 

సాక్షి: ప్రణాళికలు మార్చడం ద్వారా విజయం సాధ్యమైందా? 
గైక్వాడ్‌: గత రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టు బాగానే ఆడింది. అయితే విశాఖ పిచ్‌పై బంతి బ్యాటర్‌కు అనువుగా రావడం... తొలుత బ్యాటింగ్‌ చేస్తుండటంతో అందివచ్చిన బంతులను చక్కగా వినియోగించుకున్నాం. గత రెండు మ్యాచ్‌ల్లో ఎలాంటి ప్రణాళిక అమలు చేశామో.. ఇక్కడ అదే రీతిన ఆడాం. 

సాక్షి : ఇక్కడ జరిగిన గత మ్యాచ్‌లను సమీక్షించారా?  
గైక్వాడ్‌: అవును. జట్టు ఇక్కడ ఎలా ఆడాలి అనేది సమీక్ష చేసుకున్నాం. గత మ్యాచ్‌ల్లోనూ చక్కగా రాణించాం. ఇక్కడ ఎవరికి వారు బెస్ట్‌ గేమ్‌ ఆడాలనే అనుకున్నాం. దానికి తగ్గట్టుగానే బ్యాటింగ్‌ చేశాం. బౌలర్లు సైతం గత రెండు మ్యాచ్‌లు భిన్నంగా బెస్ట్‌ బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

సాక్షి: ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచేందుకు అమలు చేసిన ప్రణాళికలేమిటి?  
గైక్వాడ్‌: నిర్లక్ష్యపు షాట్స్‌ ఆడకుండా జాగ్రత్త తీసుకుంటూనే జట్టు బ్యాటింగ్‌ బలాన్ని ప్రదర్శించాలని అనుకున్నాం. అయితే రాణించేందుకు వ్యక్తిగత ఆటతీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక్కటే ఆలోచన.. బౌలర్‌పై ఒత్తిడి తీసుకురావాలి. అది ఆటకు దిగిన ఎన్నో బంతికి అనేది చెప్పలేం. మన ఆట తీరే బౌలర్‌కు ఒత్తిడిని కలిగిస్తుంది. టీ–20ల్లో ఏ రోజు ఆట ఆ రోజుదే. అదే ఫలితాన్ని నిర్దేశిస్తుంది.  

మరిన్ని వార్తలు