ఇంగ్లండ్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం.. జింబాబ్వే తరపున ఆడేందుకు!

9 Dec, 2022 16:47 IST|Sakshi

ఇంగ్లండ్‌ మాజీ బ్యాటర్‌ గ్యారీ బ్యాలెన్స్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌ దేశీవాళీ క్రికెట్‌లో యార్క్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాలెన్స్‌.. ఇప్పుడు తన సొం‍త దేశం జింబాబ్వే తరపున ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో యార్క్‌షైర్‌ క్రికెట్‌ క్లబ్‌తో బ్యాలెన్స్‌ తన బంధాన్ని తెంచుకున్నాడు.

కాగా బ్యాలెన్స్ అభ్యర్థనను యార్క్‌షైర్‌ క్రికెట్‌ కూడా అంగీకరించింది. ఇక యార్క్‌షైర్‌ క్రికెట్‌ క్లబ్‌తో తెగదింపులు చేసుకున్న బ్యాలెన్స్‌.. జింబాబ్వేలో రెండేళ్ల పాటు దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే అతడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇక  జింబాబ్వేలో జన్మించిన బ్యాలెన్స్‌.. తన చిన్న తనంలోనే అతడి తల్లిదండ్రలు ఇంగ్లండ్‌లో స్ధిర పడ్డారు. దీంతో ఇంగ్లీష్‌ జట్టు తరపున అతడు 2013లో  అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. బ్యాలెన్స్‌ 23 టెస్టులు, 16 వన్డేల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 

జింబాబ్వేకు ఆడటమే నా లక్ష్యం
ఇక యార్క్‌షైర్‌ నుంచి బయటకు వచ్చిన బ్యాలెన్స్‌ తొలి సారి స్పందించాడు.  "జింబాబ్వే క్రికెట్‌లో చేరేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాను. సీనియర్‌ కోచ్‌లు, ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కలిసే ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది.  దేశవాళీ క్రికెట్‌లో రాణించి  జింబాబ్వే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యమని"  బ్యాలెన్స్‌ పేర్కొన్నాడు.
చదవండి: ENG vs PAK: పాకిస్తాన్‌ క్రికెట్‌లో మరో యువ సంచలనం.. అరంగేట్ర మ్యాచ్‌లోనే 7 వికెట్లు..

మరిన్ని వార్తలు