World cup 2023: కోహ్లి, రోహిత్‌, గిల్‌ కాదు.. అతడే గేమ్‌ ఛేంజర్‌: గంభీర్‌

17 Nov, 2023 15:37 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. నవంబర్‌ 19న అహ్మదాదాబాద్‌ వేదికగా జరగనున్న తుదిపోరులో ఆసీస్‌ను చిత్తు చేసి.. ముచ్చటగా మూడోసారి వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడాలని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టింది.

ఈ క్రమంలో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌పై మాజీ ఓపెనర్‌, ఎంపీ గౌతం గంభీర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్‌తో జరగనున్న ఫైనల్లో శ్రేయస్‌ అయ్యర్‌ మరోసారి అదరగొడతాడని గంభీర్‌ జోస్యం చెప్పాడు.

కాగా శ్రేయస్‌ అయ్యర్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో దుమ్ములేపుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అయ్యర్‌ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 మ్యాచ్‌ ఆడిన అయ్యర్‌.. 75.14 సగటుతో 526 పరుగులు చేశాడు.

"ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో నా వర​కు అయితే శ్రేయాస్‌ అయ్యర్‌ బిగ్గెస్ట్‌ గేమ్‌ ఛేంజర్‌. అతడు ఈ టోర్నీకి ముందు గాయంతో బాధపడ్డాడు. గాయం నుంచి కోలుకున్న వెంటనే ఈ తరహా ప్రదర్శన చేయడం అంత ఈజీకాదు. న్యూజిలాండ్‌ వంటి జట్టుపై సెమీఫైనల్లో కేవలం 70 బంతుల్లో సెంచరీ చేయడం అయ్యర్‌కే సాధ్యమైంది.

అతడు టీమిండియాకు చాలా కీలకమైన ఆటగాడు. ఆసీస్‌తో ఫైనల్లో మరోసారి తన మార్క్‌ను చూపిస్తాడని భావిస్తున్నాను. మిడిల్‌ ఓవర్లలో జంపా, మాక్స్‌వెల్‌ను ధీటుగా అయ్యర్‌ ఎదుర్కొంటాడని ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్‌ పేర్కొన్నాడు.
చదవండిCWC 2023: టీమిండియాతో ఫైనల్‌.. ఏకపక్షంగా ఉంటుంది: ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌

మరిన్ని వార్తలు