ఇకనైనా గుర్తించాలి 

1 Sep, 2020 03:10 IST|Sakshi

జాతీయ క్రీడా పురస్కారాల విషయంలో చెస్‌ ఆటగాళ్లపై వివక్ష తగదు

ఆన్‌లైన్‌ ఒలింపియాడ్‌ స్వర్ణంతో మార్పు రావాలి

భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ఆకాంక్ష

చెన్నై: అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లలో మనోళ్లు అడుగుపెడితే పతకాలతోనే తిరిగి రావడం అలవాటుగా మార్చుకున్నారు. కానీ చెస్‌ క్రీడాకారుల విజయాలను మాత్రం కేంద్ర ప్రభుత్వంలోని క్రీడాధికారులు గుర్తించడం లేదు. అందుకే ఏడేళ్లుగా ఒక్క చెస్‌ ప్లేయర్‌కు ‘ఖేల్‌రత్న’గానీ, ‘అర్జున అవార్డు’గానీ, కోచ్‌లకు ‘ద్రోణాచార్య’ అవార్డుగానీ, చెస్‌ క్రీడాభివృద్ధికి పాటుపడిన వారికి ‘ధ్యాన్‌చంద్‌’ అవార్డుగానీ రాలేదు. అయితే ఆదివారం ముగిసిన ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో కనబరిచిన ప్రదర్శనతో వచ్చే ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల విషయంలో చెస్‌ ఆటగాళ్ల నిరీక్షణకు తెరపడే అవకాశాలున్నాయని భారత సూపర్‌ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ మాజీ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. కరోనా వల్ల ముఖాముఖి టోర్నీలు లేకపోవడంతో ఆన్‌లైన్‌ ఒలింపియాడ్‌ నిర్వహించగా భారత్‌... రష్యాతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో వెటరన్‌ గ్రాండ్‌మాస్టర్‌  ఓ ఇంటర్వూ్యలో పలు అంశాలపై తన అభిప్రాయాలు వెలిబుచ్చాడు.  

► ఒలింపియాడ్‌ విజయంతో చెస్‌పట్ల అంతా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నాను. చెస్‌ ఆటగాళ్లకు ‘అర్జున’, కోచ్‌ల ‘ద్రోణాచార్య’ అవార్డులు వస్తాయని నమ్మకంతో ఉన్నాను. కొన్నిసార్లు కొందరికి మన ఉనికిని చాటు చెప్పాల్సి ఉంటుంది. తాజా ఒలింపియాడ్‌ స్వర్ణంతో పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశాభావంతో ఉన్నాను. కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో చెస్‌ క్రీడాకారులు విజయాలు సాధిస్తున్నా క్రీడా మంత్రిత్వ శాఖ అస్సలు గుర్తించడం లేదు.  
► ఇక అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌)లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సమాఖ్య వారు ఈ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యలపై సుదీర్ఘ లేఖలు రాసే బదులు ఇలాంటి విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించాలి.  
► ఈ టోర్నమెంట్‌లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేను. నిజానికి నేను జట్టును ముందుండి నడిపించాలి. కానీ అలా జరగలేదు. ఈ ఏడాది ముఖాముఖిగా జరగాల్సిన రెగ్యులర్‌ చెస్‌ ఒలింపియాడ్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దాని బదులు ఆన్‌లైన్‌లో నిర్వహించడం నిజంగా అద్భుతం. ఈ 2020లో ముఖాముఖి టోర్నీలకైతే చోటే లేదు. దీంతో ఈ ఏడాది ఆసాంతం ఇక ఆన్‌లైన్‌ టోర్నీలే నిర్వహించాలి. 
► భారత క్రీడాకారులంతా ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. నేను ఆట మధ్యలో సహచరుల ఎత్తుల్ని గమనించాను. నిజంగా ప్రతి ఒక్కరు వేసిన ఎత్తులు నన్ను ఆశ్చర్యపరిచాయి.   
► సీనియర్లే కాదు... భారత్‌లో జూనియర్లు, బాలబాలికలంతా బాగా ఆడుతున్నారు. దీంతో మన బెంచ్‌ పరిపుష్టిగా ఉంది. దీనివల్ల భవిష్యత్‌లో మన చెస్‌కు, మేటి ఫలితాలకు ఢోకా ఉండదు.  
► భారత్, రష్యాల మధ్య జరిగిన ఫైనల్‌ రౌండ్‌ పోటీలను దేశవ్యాప్తంగా 60 వేల పైచిలుకు వీక్షించడం సంతోషించదగ్గ విషయం. ఇంతటి ఆదరణ నేను ఊహించలేదు. ఇక భారత్‌ విషయానికొస్తే ఈ విజయంతో కొత్త తరం కూడా భాగస్వాములవడం సానుకూలాంశం.
► సీనియర్లే కాదు... భారత్‌లో జూనియర్లు, బాలబాలికలంతా బాగా ఆడుతున్నారు. దీంతో మన బెంచ్‌ పరిపుష్టిగా ఉంది. దీనివల్ల భవిష్యత్‌లో మన చెస్‌కు, మేటి ఫలితాలకు ఢోకా ఉండదు.  
► భారత్, రష్యాల మధ్య జరిగిన ఫైనల్‌ రౌండ్‌ పోటీలను దేశవ్యాప్తంగా 60 వేల పైచిలుకు వీక్షించడం సంతోషించదగ్గ విషయం. ఇంతటి ఆదరణ నేను ఊహించలేదు. ఇక భారత్‌ విషయానికొస్తే ఈ విజయంతో కొత్త తరం కూడా భాగస్వాములవడం సానుకూలాంశం.

మరిన్ని వార్తలు