WC 2023: తిలక్‌ ఉన్నా కూడా అతడికి జట్టులో చోటు దక్కిందంటే అదృష్టమే: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

7 Sep, 2023 09:02 IST|Sakshi
వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో వికెట్‌ తీసిన ఆనందంలో తిలక్‌ వర్మ

ICC ODI WC 2023: Ex-Australia cricketer names ‘lucky’ Suryakumar's replacement: టీమిండియా ప్రపంచకప్‌-2023 జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎలా ఎంపిక చేశారని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ టామ్‌ మూడీ ప్రశ్నించాడు. అతడికి బదులు హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మను సెలక్ట్‌ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. కేవలం అదృష్టం కారణంగానే సూర్య వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడని పేర్కొన్నాడు.

15 మంది సభ్యుల జట్టు
భారత్‌ వేదికగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు వన్డే ప్రపంచకప్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. ఆతిథ్య టీమిండియా సహా మొత్తంగా పది జట్లు ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొననున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

ఆసియా వన్డే కప్‌-2023 ప్రధాన జట్టులో భాగమైన తిలక్‌ వర్మ, ప్రసిద్‌ కృష్ణ.. ట్రావెలింగ్‌ రిజర్వ్‌ సంజూ శాంసన్‌ను మినహాయించి మిగతా వాళ్లందరినీ మెగా ఈవెంట్‌కు సెలక్ట్‌ చేసింది. టీ20లలో నంబర్‌ 1 అయినప్పటికీ.. వన్డేల్లో పేలవ రికార్డు ఉన్న ముంబై బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్‌ ఎంపిక విశ్లేషకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

తిలక్‌ ఉండగా సూర్యను ఎలా సెలక్ట్‌ చేస్తారు?
మిడిలార్డర్‌లో కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సహా ఇషాన్‌ కిషన్‌ రూపంలో ఆప్షన్లు ఉన్నప్పటికీ అతడికి అవకాశం ఇవ్వడం ఎందుకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. టామ్‌ మూడీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘మిడిలార్డర్‌లో తిలక్‌ వర్మ రూపంలో లెఫ్టాండ్‌ బ్యాటింగ్‌ స్పెషలిస్టు, పార్ట్‌టైమ్‌ స్పిన్‌ బౌలర్‌ అందుబాటులో ఉన్నప్పటికీ.. సూర్యకుమార్‌ యాదవ్‌కు ఈ జట్టులో చోటు దక్కిందంటే అది అతడి అదృష్టమనే చెప్పాలి. ఇషాన్‌ కిషన్‌ కూడా ఉన్నాడని మనం అనుకోవచ్చు.

అయినా... జట్టులో ఇద్దరు లెఫ్టాండర్లు ఉంటే వారి సేవలను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందే తప్ప నష్టం లేదు.  ఫ్లెక్సిబిలిటీ గురించి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లలో మాట్లాడుతూ ఉంటాడు కదా! కాబట్టి నా అభిప్రాయం సరైందే అనుకుంటున్నా’’ అని టామ్‌ మూడీ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు.

దేశవాళీ వన్డేల్లో అదరగొట్టిన తిలక్‌
కాగా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌(173 పరుగులతో టాప్‌ స్కోరర్‌)తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన తిలక్‌ వర్మ.. వన్డేల్లో ఇంకా అరంగేట్రం చేయలేదు. అయితే, అతడి దేశవాళీ వన్డే రికార్డు అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు 25 మ్యాచ్‌లలో 5 శతకాలు, 5 హాఫ్‌ సెంచరీలతో 1236 పరుగులు సాధించాడు.

ఈ నేపథ్యంలో.. ఎడమచేతి వాటం గల బ్యాటర్‌ కావడం తిలక్‌కు ఉన్న అదనపు అర్హత అని పేర్కొంటూ బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ అతడికి ఆసియా కప్‌ జట్టులో చోటిచ్చినట్లు తెలిపాడు. కానీ.. ఐసీసీ టోర్నీలో మాత్రం ఈ యువ సంచలనానికి నిరాశ తప్పలేదు.

అంతర్జాతీయ వన్డేల్లో సూర్య పేలవ రికార్డు
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 26 వన్డేలు ఆడిన సూర్యకుమార్‌ యాదవ్‌ రెండు అర్ధ శతకాల సాయంతో 511 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 64. ఇక ఐపీఎల్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌కు సూర్య, తిలక్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

చదవండి:  సిగ్గుపడు రోహిత్‌! నువ్వసలు కెప్టెన్‌వేనా?.. వాళ్లకు ఉన్నపాటి బుద్ధి నీకు లేదు!

మరిన్ని వార్తలు