Ishan Kishan: అప్పుడు కోహ్లి.. ఇప్పుడు రోహిత్‌; బలయ్యింది మాత్రం ఒక్కడే

11 Apr, 2023 22:26 IST|Sakshi
Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో తొలిసారి ముంబై ఇండియన్స్‌కు మంచి ఆరంభం లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌లు తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. అయితే ఇద్దరు మంచిగా ఆడుతున్నారు అన్న తరుణంలో రోహిత్‌ తప్పిదం కారణంగా ఇషాన్‌ కిషన్‌ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. 

ఇన్నింగ్స్‌ 8వ ఓవర్లో లలిత్‌ యాదవ్‌ వేసిన మూడో బంతిని ఇషాన్‌ పాయింట్‌ దిశగా ఆడాడు. సింగిల్‌కు రిస్క్‌ అని తెలిసినా రోహిత్‌ కాల్‌ ఇచ్చి పరిగెత్తాడు. అయితే ఇషాన్‌కు సింగిల్‌ తీయడం ఇష్టం లేదు. కానీ కెప్టెన్‌ అప్పటికే సగం పిచ్‌ దాటి వచ్చేయడంతో చేసేదేం లేక పరిగెత్తాడు. కానీ అప్పటికే ఫీల్డర్‌ ముకేశ్‌ కుమార్‌ నుంచి బంతిని అందుకున్న లలిత్‌ యాదవ్‌ ఇషాన్‌ క్రీజులోకి చేరుకునేలోపే వికెట్లను గిరాటేశాడు. దీంతో ఇషాన్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

అయితే ఇషాన్‌ ఔటవ్వడం రోహిత్‌కు బాధ కలిగించింది. ఇషాన్‌ కూడా పెవిలియన్‌ వెళ్తూ రోహిత్‌వైపు బాధతో చూశాడు. ఇక ఇషాన్‌కు ఇది కొత్తేం కాదు. ఇంతకముందు మరో సీనియర్‌ కోహ్లి కారణంగా ఇటీవలే జరిగిన వన్డే సిరీస్‌లో అచ్చం ఇలానే రనౌట్‌ అయ్యాడు. అప్పుడు కోహ్లి కారణమైతే.. ఇప్పుడు రోహిత్‌. ఎటు చూసినా బలయ్యింది మాత్రం ఇషాన్‌ కిషనే. ఇక్కడ తేడా ఏంటంటే కోహ్లి ఔట్ చేసింది అంతర్జాతీయ మ్యాచ్‌ అయితే.. రోహిత్‌ ఔట్‌ చేసింది ఐపీఎల్‌లో.

ఈ క్రమంలో రోహిత్‌ రనౌట్ల విషయంలో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌లో రోహిత్‌ ఒక బ్యాట్స్‌మన్‌ను రనౌట్‌ చేయడం ఇది 37వ సారి కావడం విశేషం. ఈ విషయంలో దినేశ్‌ కార్తిక్‌తో కలిసి రోహిత్‌ సంయుక్తంగా ఉన్నాడు. ఇక తన ఓపెనింగ్‌ పార్టనర్‌ను రనౌట్‌ చేయడం రోహిత్‌కు ఇది 26వ సారి. ఈ విషయంలో ఎంఎస్‌ ధోనితో సంయుక్తంగా ఉండడం గమనార్హం.

మరిన్ని వార్తలు