‘ఆ రెండు టెస్టుల్లో ఫిక్సింగ్‌ జరగలేదు’

18 May, 2021 06:01 IST|Sakshi

దుబాయ్‌: సుమారు మూడేళ్ల క్రితం ‘క్రికెట్స్‌ మ్యాచ్‌ ఫిక్సర్స్‌’ పేరుతో ప్రముఖ టీవీ చానల్‌ ‘అల్‌ జజీరా’ ప్రసారం చేసిన రెండు డాక్యుమెంటరీలలోని ఆరోపణలను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కొట్టి పారేసింది. ఇందులో పేర్కొన్న అంశాలపై తాము పూర్తి స్థాయిలో విచారణ జరిపామని, ఎక్కడా తప్పు జరగలేదని స్పష్టం చేసింది. డాక్యుమెంటరీ తొలి భాగంలో రెండు టెస్టు మ్యాచ్‌లలో స్పాట్‌ ఫిక్సింగ్‌ జరిగిందని చెప్పిన చానల్‌... రెండో భాగంలో 2011–12 మధ్య కాలంలో 15 మ్యాచ్‌లలో ఫిక్సింగ్‌ చోటు చేసుకుందని ఆరోపించింది.  2016లో భారత్, ఇంగ్లండ్‌ మధ్య చెన్నైలో జరిగిన టెస్టు (ఇందులో భారత్‌ ఇన్నింగ్స్, 75 పరుగులతో గెలిచింది)...2017లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రాంచీలో జరిగిన టెస్టు (మ్యాచ్‌ డ్రాగా ముగిసింది)లలో ఇంగ్లండ్, ఆసీస్‌ ఆటగాళ్లు ఫిక్సర్ల సూచనల ప్రకారం బ్యాటింగ్‌ చేసినట్లు అల్‌ జజీరా వెల్లడించింది.

అయితే సుదీర్ఘ కాలం విచారణ జరిగిన ఐసీసీ వీటన్నింటిని తప్పుగా తేల్చింది. అసలు చానల్‌ సమర్పించిన ఆధారాలు ఏ రకంగానూ నమ్మశక్యంగా లేవని స్పష్టం చేసింది. ‘చానల్‌ చూపించిన దృశ్యాలను బట్టి చూస్తే ఏదీ అసహజంగా అనిపించలేదు. ఫిక్సింగ్‌ను సూచించే విధంగా ఎలాంటి అంశం అందులోనూ కనిపించలేదు. అసలు అందులో చెప్పే విషయాలేవీ నమ్మశక్యంగా లేవు. ఇలాంటి అంశాలపై పట్టు ఉన్న నలుగురు నిపుణులతో మేం నియమించిన కమిటీ అన్ని అంశాలను పరిశీలించి తమ నివేదిక ఇచ్చింది’ అని ఐసీసీ ప్రకటించింది. మొత్తంగా ఈ వివాదంతో సంబంధం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురికి కూడా క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు