Ind vs Aus: ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్‌... అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌!

8 Nov, 2023 17:13 IST|Sakshi
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ- ఆసీస్‌ స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ (ఫైల్‌ ఫొటో)

Ind vs Aus 2023 T20 Series: ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్‌ను హైదరాబాద్‌లో నేరుగా వీక్షించాలనుకున్న అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌! టీ20 సిరీస్‌లో భాగంగా డిసెంబరు 3న ఉప్పల్‌ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌ రద్దైంది. 

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా- టీమిండియాతో పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌కు సిద్ధంకానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇరు జట్లు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది.

ఇందులో భాగంగా.. వైజాగ్‌ వేదికగా నవంబరు 23న తొలి మ్యాచ్‌ జరుగనుండగా.. డిసెంబరు 3న హైదరాబాద్‌లో చివరి మ్యాచ్‌ నిర్వహించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి నిర్ణయించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేశారు.

ఎన్నికల ఫలితాల హడావుడి కారణంగా బందోబస్తు ఇవ్వలేమని పోలీసులు తెలిపిన నేపథ్యంలో.. మ్యాచ్‌ వేదికను బెంగళూరుకు మార్చారు. బీసీసీఐ నుంచి ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా.. నవంబరు 23న వైజాగ్‌, నవంబరు 26న తిరువనంతపురం, నవంబరు 28న గువాహటి, డిసెంబరు 1న నాగ్‌పూర్‌. డిసెంబరు 3న హైదరాబాద్‌లో భారత్‌ -ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌లకు బీసీసీఐ గతంలో షెడ్యూల్‌ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నవంబరు 30న జరుగనుండగా.. ఫలితాలు డిసెంబరు 3న వెల్లడి కానున్నాయి.  

చదవండి: పాపం రూట్‌.. చెత్త షాట్‌కు తప్పదు భారీ మూల్యం! వీడియో వైరల్

మరిన్ని వార్తలు