IND Vs ENG 3rd Test Day 2: ఇంగ్లండ్‌-423/8 , క్రీజులో క్రెగ్‌ ఒవర్‌టన్‌, ఓల్లీ రాబిన్‌సన్‌

27 Aug, 2021 15:42 IST|Sakshi

లీడ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ భారీ స్కోరు దిశగా సాగుతుంది.  రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 423 పరుగులను చేసింది.  ప్రస్తుతం క్రీజులో  క్రెగ్‌ ఒవర్‌టన్‌ 24 నాటౌట్‌, ఓల్లీ రాబిన్‌సన్‌ (0) నాటౌట్‌గా ఉన్నారు. భారత బౌలర్లు రెండో రోజు ప్రారంభం నుంచి వికెట్లు దక్కలేదు. ఇంగ్లండ్‌ బ్యాట్‌మెన్స్‌ భారత బౌలర్లపై తొలి రోజునుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. చివరి సెషన్‌ తప్ప మిగతా సెషన్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. భారత్‌పై 345 పరుగుల ఆధ్యిక్యంలో ఇంగ్లండ్‌ కొనసాగుతుంది. 

ఏడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. మొయిన్‌ అలీ(8) ఔట్‌

రూట్‌(121)ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన బుమ్రా.. ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ డౌన్‌ 
కొరకరాని కొయ్యలా మారిన రూట్‌(121; 14 ఫోర్లు)ను బుమ్రా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఇప్పటికే చేయాల్సిన నష్టం అంతా చేసేసని ఇంగ్లండ్‌ కెప్టెన్‌.. ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రీజ్‌లో మొయిన్‌ అలీ(8), సామ్‌ కర్రన్‌ ఉన్నారు. 118 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 383/6. 

షమీ విజృంభణ.. 10 పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు
రూట్‌ శతక్కొట్టాక ఇంగ్లండ్‌ జట్టు వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ రెండు వికెట్లు షమీ ఖాతాలోకి వెళ్లాయి. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌108 ఓవర్లో 350/3 స్కోర్‌ వద్ద షమీ బెయిర్‌స్టో(29; 4 ఫోర్లు, సిక్స్‌)ను బోల్తా కొట్టించగా, సరిగ్గా పది పరుగుల వ్యవధిలో బట్లర్‌(7; ఫోర్‌)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. 112 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 360/5. క్రీజ్‌లో రూట్‌(105), మొయిన్‌ అలీ(0) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 282 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

శతక్కొట్టిన రూట్‌.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్‌
ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో వరుసగా మూడో శతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో అతను కెరీర్‌లో 22వ శతకాన్ని బాదేశాడు. 96 పరుగుల వద్ద ఇషాంత్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది రూట్‌ సెంచరీ సాధించాడు. 103.2 తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 329/3. క్రీజ్‌లో రూట్‌కు తోడుగా బెయిర్‌ స్టో(15) ఉన్నాడు. కాగా, రూట్‌కు ఈ శతకం కెరీర్‌లో చాలా ప్రత్యేకంగా నిలువనుంది. ఈ సెంచరీ ద్వారా అతను పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక సెంచరీలు(6) సాధించిన ఆటగాడిగా మైకేల్‌ వాన్‌(1997లో 6 సెంచరీలు), డెన్నిస్‌ క్రాంప్టన్‌(1947లో 6 శతకాలు)ల సరసన నిలిచాడు. అలాగే భారత్‌పై అత్యధిక సెంచరీలు(8) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 

మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. మలాన్‌(70) ఔట్‌
టీమిండియాకు ఎట్టకేలకు మరో బ్రేక్‌ లభించింది. టీ విరామానికి ముందు డేవిడ్‌ మలాన్‌(70; 11 ఫోర్లు)ను సిరాజ్‌ బోల్తా కొట్టించాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి మలాన్‌ వెనుదిరిగాడు. 94 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 298/3. ప్రస్తుతం ఆ జట్టు 220 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్‌.. రూట్‌(70*), మలాన్‌(64*) అర్ధసెంచరీలు
తొలి సెషన్‌లో రెండు వికెట్లు పడగొట్టి, ఆతిధ్య జట్టుకు పగ్గాలు వేసేలా కనిపించిన టీమిండియా.. ఆ తర్వాత వికెట్‌ కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఓపెనర్లు వెనుదిరిగాక క్రీజ్‌లోకి వచ్చిన మలాన్‌(64; 10 ఫోర్లు), జో రూట్‌(70; 8 ఫోర్లు)లు పసలేని టీమిండియా బౌలింగ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని కనబర్చారు. ముఖ్యంగా రూట్‌ వేగంగా పరుగులు సాధిస్తూ భారత బౌలర్లను ఆటాడుకుంటున్నాడు. ఫలితంగా 90 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 282/2గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 204 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. హసీబ్‌ హమీద్‌(68) బౌల్డ్‌
ఓవర్‌నైట్‌ స్కోర్‌ 120/0తో రెండో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్‌ జట్టు.. తొలి సెషన్‌లోనే ఇ‍ద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. తొలుత 135 పరుగుల వద్ద బ‌ర్న్స్(61)ను షమీ పెవిలియన్‌కు పంపగా, 159 పరుగుల వద్ద హసీబ్‌ హమీద్‌(68; 12 ఫోర్లు)ను జడేజా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. క్రీజ్‌లో డేవిడ్‌ మలాన్‌(18), జో రూట్‌(0) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 81 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.   

ఎట్టకేలకు తొలి వికెట్‌.. షమీకి చిక్కిన బ‌ర్న్స్ (61)
ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఎట్టకేలకు బ్రేక్ దొరికింది. ఆ జట్టు ఓపెన‌ర్, బర్త్‌డే బాయ్‌ రోరీ బ‌ర్న్స్(61; 6 ఫోర్లు, సిక్స్‌) ష‌మీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 50 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 135/1. క్రీజ్‌లో హసీబ్‌ హమీద్‌(66), డేవిడ్‌ మలాన్‌(0) ఉన్నారు. 120/0 వ‌ద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌.. మ‌రో 15 పరుగులు జోడించి బ‌ర్న్స్ వికెట్‌ను కోల్పోయింది. కాగా, ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగలకే చాపచుట్టేసిన విష‌యం తెలిసిందే.
చదవండి: నేటి నుంచి ధనాధన్‌ క్రికెట్‌ లీగ్‌ ప్రారంభం.. భారత్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు