IND Vs ENG 4th Test: ఇంగ్లీష్‌ ఆటగాళ్లను అలర్ట్‌ చేసిన నాసర్‌ హుస్సేన్‌

1 Sep, 2021 10:45 IST|Sakshi

లండన్‌: విజయోత్సాహంలో ఉన్న ఇంగ్లండ్ జట్టును ప్రముఖ వ్యాఖ్యాత, ఆ దేశ మాజీ కెప్టెన్‌ నాసర్ హుస్సేన్ అలర్ట్‌ చేశాడు. 78 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడింది కదా అని టీమిండియాను తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో 36 పరుగులకే ఆలౌటై ఆ తర్వాత ఊహించని రీతిలో చెలరేగి, సిరీస్ కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. టీమిండియాను ఏమాత్రం తక్కువ అంచనా వేసినా.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. 

ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడకపోతే.. కోహ్లి సేన దెబ్బ తిన్న పులిలా గర్జిస్తుందని, దీంతో సిరీస్‌ కోల్పోయే ప్రమాదం ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చాడు. ఘోర పరాజయాల అనంతరం ఎలా పుంజుకోవాలో టీమిండియాకు బాగా తెలుసని, దీనికి చరిత్రే సాక్షమని తెలిపాడు. ఇక లార్డ్స్ టెస్ట్‌లో చిరస్మరణీ విజయాన్నందుకున్న టీమిండియా.. లీడ్స్‌ టెస్ట్‌లో 78 పరుగులకే ఆలౌటై, ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఫలితంగా 5 టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమమైంది. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య ఓవల్ వేదికగా కీలకమైన నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.
చదవండి: ఆండర్సన్‌కు ఇదే ఆఖరి సిరీస్‌.. ఐదో టెస్ట్‌ అనంతరం రిటైర్మెంట్‌..?
 

మరిన్ని వార్తలు