WC 2023: సెంచరీ కోసం ఆడేవాళ్లు ఓ రకం.. జట్టు కోసం ఆడే వాళ్లు మరో రకం.. రోహిత్‌ అలాంటి వాడే: గంభీర్‌

30 Oct, 2023 15:29 IST|Sakshi
విరాట్‌ కోహ్లి- రోహిత్‌ శర్మ

ICC WC 2023: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు. నిస్వార్థంగా జట్టు విజయం కోసం పాటుపడేవాడే గొప్ప నాయకుడని.. రోహిత్‌లో ఆ లక్షణాలు మెండుగా ఉన్నాయని కొనియాడాడు. సెంచరీల కోసం ఆడే వాళ్ల కంటే జట్టు కోసం ఆడేవాళ్లే ముఖ్యమంటూ పరోక్షంగా విరాట్‌ కోహ్లిని విమర్శించాడు.

అజేయంగా ఆరు
సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా వరుసగా ఆరు విజయాలతో మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. టోర్నీ ఆరంభం నుంచి ఓటమన్నదే ఎరుగక ముందుకు సాగుతోంది రోహిత్‌ సేన.

లక్నోలో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై వంద పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్‌ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌(9), విరాట్‌ కోహ్లి(0), శ్రేయస్‌ అయ్యర్‌(4) పూర్తిగా విఫలం కాగా రోహిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.

మొత్తంగా 101 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 87 పరుగులు సాధించాడు. కెప్టెన్‌తో పాటు కేఎల్‌ రాహుల్‌(39), సూర్యకుమార్‌ యాదవ్‌(49) రాణించడంతో 229 పరుగులు చేయగలిగింది టీమిండియా.

రోహిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు విజృంభించడంతో 129 పరుగులకే ఆలౌట్‌ అయిన ఇంగ్లండ్‌ 100 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడిన మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌.. రోహిత్‌ శర్మ కెప్టెన్సీ, ఇన్నింగ్స్‌ను కొనియాడాడు.

‘‘జట్టు నుంచి ఏం ఆశిస్తున్నాడో.. తానూ అదే చేసేవాడు నిజమైన లీడర్‌. జట్టులో ఉన్న బ్యాటర్లంతా రాణించాలని కోరుకోవడమే కాదు కెప్టెన్‌గా ఉన్నపుడు తానూ మెరుగ్గా ఆడితే స్పూర్తిదాయకంగా ఉంటుంది.

అలాంటి వాళ్లే లీడర్లు
అలా చేసే వాళ్లు లీడర్లుగా గుర్తింపు పొందుతారు. అంతేతప్ప.. పీఆర్‌(పబ్లిక్‌ రిలేషన్‌) గానీ.. మార్కెటింగ్‌ ఏజెన్సీ గానీ మనకోసం ఇలాంటి ప్రచారాలు చేయవు. టాప్‌ రన్‌స్కోరర్ల విషయంలో రోహిత్‌ పదో నంబర్‌ లేదంటే ఐదో నంబర్‌లో ఉండొచ్చు. లిస్టులో తను ఎక్కడ ఉన్నాడన్న విషయంతో అసలు సంబంధమే లేదు. దృష్టి మొత్తం ట్రోఫీ మీదనే ఉండాలి.

సెంచరీ కోసం ఒకలా.. జట్టు కోసం మరోలా
నవంబరు 19న పని పూర్తిచేయాలి. నీ లక్ష్యం కేవలం సెంచరీ పూర్తి చేయడం మాత్రమే అయితే.. నువ్వు ఆడే విధానం వేరుగా ఉంటుంది. అదే జట్టు కోసం వరల్డ్‌కప్‌ గెలవాలంటే మరో విధంగా ఉంటుంది. అలాంటపుడు మనకు నిస్వార్థమైన కెప్టెన్‌ కావాలి.

రోహిత్‌ శర్మ అలాంటి వాడే. అతడి నుంచి నేను కోరుకునేది ఇదే. దేశానికి ట్రోఫీ అందించాలి’’ అని గంభీర్‌ రోహిత్‌ను ప్రశంసిస్తూ.. పరోక్షంగా కోహ్లి 78వ సెంచరీ చేసిన తీరును విమర్శించాడు. 

కోహ్లి గురించేనా?
కాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా కేఎల్‌ రాహుల్‌ సహకారంతో కోహ్లి శతకం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇలాంటి టోర్నీల్లో గెలుపు ఒక్కటి మాత్రమే కాకుండా రన్‌రేటు కూడా ప్రభావం చూపుతుంది.. అయినా కోహ్లి తన స్వార్థం కోసం జట్టు ప్రయోజనాలను తాకట్టుపెట్టాడని కొంతమంది నెటిజన్లు ట్రోల్‌ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా గంభీర్‌ చేసిన వ్యాఖ్యలు ఆ విమర్శలను గుర్తుచేశాయి. 

చదవండి: టీమిండియా ఇక చాలు! దిష్టి తగులుతుంది.. ఆ గండం గట్టెక్కితే! వరల్డ్‌ రికార్డు మనదే 

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు