WC 2022 Ind Vs Eng: టీమిండియా ఓటమిపై పాక్‌ ప్రధాని ట్వీట్‌ వైరల్‌.. కౌంటర్‌ ఇస్తున్న ఫ్యాన్స్‌

10 Nov, 2022 20:05 IST|Sakshi

ICC Mens T20 World Cup 2022 - India vs England, 2nd Semi-Final: ఘోర పరాజయంతో టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ నుంచి నిష్క్రమించింది టీమిండియా. అడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటర్లు పర్వాలేదనిపించినా.. ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేక భారత బౌలరుల​ ఆపసోపాలు పడిన తీరు అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

పవర్‌ ప్లేలో మనవాళ్లు తడబడితే(38) ఇంగ్లండ్‌ ఓపెనర్లు జోస్‌ బట్లర్‌, అలెక్స్‌ హేల్స్‌ మాత్రం ఏకంగా 63 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత వారి దూకుడుకు అడ్డుకట్టవేయడం టీమిండియా బౌలర్ల తరం కాలేదు. తమదైన శైలిలో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ పొట్టి ఫార్మాట్‌ ఉన్న మజాను ప్రేక్షకులకు అందించారు ఈ ఇద్దరు బ్యాటర్లు.

బట్లర్‌ 80, హేల్స్‌ 86 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చారు. ఇదిలా ఉంటే.. బుధవారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. 7 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. నవంబరు 13న మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమైంది.

పాక్‌ ప్రధాని ట్వీట్‌ వైరల్‌
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియా ఓటమిని ఉద్దేశిస్తూ.. ‘‘టీ20 వరల్డ్‌కప్‌లో ఈ ఆదివారం.. 152/0 వర్సెస్‌ 170/0 అన్నమాట’’ అని పేర్కొన్నారు.

గతేడాది ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో చేతిలో భారత జట్టు 10 వికెట్ల తేడాతో పరాజయం(అప్పుడు పాక్‌ స్కోరు 152/0) పాలైన విషయాన్ని ఉటంకిస్తూ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. వరల్డ్‌కప్‌ తాజా ఎడిషన్‌లో.. పాక్‌, ఇంగ్లండ్‌ ఫైనల్‌ చూడబోతున్నామని పేర్కొన్నారు.

ఫ్యాన్స్‌ కౌంటర్‌
కాగా ఈ ట్వీట్‌పై టీమిండియా ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ‘‘మా వాళ్లేమీ న​క్క తోక తొక్కి.. ఎవరో ఎవరినో ఓడించడం ద్వారా సెమీస్‌కు చేరలేదు. సెమీ ఫైనల్‌ చేరేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడలేదు. ఒక్క మ్యాచ్‌లో ఓటమి చెందినంత మాత్రాన మా వాళ్లేమీ తక్కువ కాదు’’ అంటూ కౌంటర్‌ ఇస్తున్నారు. ఆటలో గెలుపోటములు సహజమని, ఇండియా ఫైనల్‌ చేరితే కథ వేరేగా ఉండేందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ టోర్నీలో జింబాబ్వే చేతిలో పాక్‌ ఓటమిని గుర్తు చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు.

చదవండి: Rohit Sharma On India Loss: తీవ్ర నిరాశకు లోనయ్యాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే.. క్రెడిట్‌ వాళ్లకే!
WC 2022: ఆ ఇద్దరూ విఫలం.. వీళ్లపైనే భారం! అసలైన మ్యాచ్‌లో అంతా తలకిందులు! టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు

మరిన్ని వార్తలు