IND VS SA 1st ODI: 116 పరుగులకు ఆలౌట్‌.. సౌతాఫ్రికా చెత్త రికార్డులు

17 Dec, 2023 19:36 IST|Sakshi

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జొహనెస్‌బర్గ్‌ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో చిత్తుగా ఓడటం ద్వారా సౌతాఫ్రికా రెండు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. 

సొంతగడ్డపై అ‍త్యల్ప స్కోర్‌..
ఈ మ్యాచ్‌లో కేవలం 116 పరుగులకే కుప్పకూలడం ద్వారా సౌతాఫ్రికా సొంతగడ్డపై ఏ దేశంపై అయినా వన్డేల్లో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. దీనికి ముందు 2018లో సెంచూరియన్‌లో చేసిన 119 పరుగులు ఆ జట్టుకు హోం గ్రౌండ్‌లో అత్యల్ప స్కోర్‌గా ఉండింది. 

బంతుల పరంగా రెండో అతి పెద్ద ఓటమి..
సౌతాఫ్రికా నిర్ధేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్‌.. మరో 200 బంతులు మిగిలుండగానే ఛేదించింది. బంతుల పరంగా సౌతాఫ్రికాకు ఇది రెండో అతి పెద్ద ఓటమిగా నిలిచింది. 2008లో నాటింగ్‌హమ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన ఓటమి బంతుల పరంగా సౌతాఫ్రికాకు అతి భారీ ఓటమిగా రికార్డైంది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ మరో 215 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.  

మ్యాచ్‌ విషయానికొస్తే.. అర్ష్‌దీప్‌ (10-0-37-5), ఆవేశ్‌ ఖాన్‌ (8-3-27-4) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్‌ 16.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రుతురాజ్‌ (5) తక్కువ స్కోర్‌కే ఔటైనా.. అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్‌ (55 నాటౌట్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (52) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో భారత్‌ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. రెండో వన్డే డిసెంబర్‌ 19న జరుగనుంది.

>
మరిన్ని వార్తలు