Ind vs SA: ఛేదించగల లక్ష్యమే.. వాళ్లు బ్యాటింగ్‌ చేసినపుడు మాత్రం: మార్క్రమ్‌

15 Dec, 2023 10:10 IST|Sakshi
సిరీస్‌ సమం- ట్రోఫీని పంచుకున్న టీమిండియా, సౌతాఫ్రికా (PC: BCCI)

South Africa vs India, 3rd T20I: టీమిండియా చేతిలో ఘోర ఓటమి తమను నిరాశకు గురిచేసిందని సౌతాఫ్రికా కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ అన్నాడు. స్థాయికి తగ్గట్లు రాణించి ఉంటే లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించేవాళ్లమేనని పేర్కొన్నాడు. కాగా మూడో టీ20లో భారత జట్టు సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.

జొహన్నస్‌బర్గ్‌లోని వాండరర్స్‌ వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌(41 బంతుల్లో 60), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(56 బంతుల్లో 100) అద్భుతంగా రాణించారు. వీరిద్దరి హీరోచిత ఇన్నింగ్స్‌ కారణంగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగుల స్కోరు సాధించింది.

ఈ క్రమంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. పేసర్లు ముకేశ్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ ఒక్కో వికెట్‌ తీయగా.. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే, మరో స్పిన్నర్‌, చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

మొత్తంగా 2.5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఈ బర్త్‌డే బాయ్‌ పదిహేడు పరుగులిచ్చి..  ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. ఇలా భారత బౌలర్ల విజృంభణ కారణంగా ఆతిథ్య సౌతాఫ్రికా 13.5 ఓవర్లలో 95 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. దీంతో ఏకంగా 106 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని చవిచూసింది.

ఛేదించదగ్గ లక్ష్యమే
ఇక రెండో టీ20లో ఓడినప్పటికీ.. నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్‌ సేన సిరీస్‌ను సమం చేసి ట్రోఫీని పంచుకుంది. ఈ నేపథ్యంలో ప్రొటిస్‌ జట్టు సారథి ఎయిడెన్‌ మార్క్రమ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది మేము ఛేదించదగ్గ స్కోరే.

టీమిండియా బ్యాటింగ్‌ చేసినపుడు
కానీ పనిపూర్తి చేయలేకపోయాం. పూర్తిగా విఫలమయ్యాం. నిజానికి మేము ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో బ్యాటర్లు నలుమూలలా హిట్‌ చేయగల పరిస్థితి ఉంది. ఛేజింగ్‌లోనూ ఇలాగే ఉంటుందనుకున్నాం. ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. 

అయితే, ఈ సిరీస్‌ ద్వారా మాకు కొన్ని సానుకూలతలు కూడా లభించాయి. లోపాలు సరిచేసుకుని సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతాం’’అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో మార్క్రమ్‌ 14 బంతుల్లో 25 పరుగులు సాధించాడు.

సూర్య ప్రతాపం
ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ మిల్లర్‌ 35 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు.. సుడిగాలి శతకంతో చెలరేగిన టీమిండియా సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా అందుకున్నాడు. 

చదవండి:  మహ్మద్‌ సిరాజ్‌ బుల్లెట్‌ త్రో.. సౌతాఫ్రికా బ్యాటర్‌ ఫ్యూజ్‌లు ఔట్‌!

>
మరిన్ని వార్తలు