Ra Sankaran: నటుడు కన్నుమూత.. గురువు మరణం కలిచివేసిందంటూ భారతీరాజా పోస్ట్‌..

15 Dec, 2023 08:20 IST|Sakshi

సీనియర్‌ దర్శకుడు, నటుడు ఆర్‌ శంకరన్‌ (93) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం చైన్నెలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.  ఆయన మృతి పట్ల దర్శకుడు భారతి రాజా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన గురువు శంకరన్‌ మృతి తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. అదేవిధంగా పలువురు సినీ ప్రముఖులు శంకరన్‌కు నివాళులు అర్పిస్తున్నారు.

1962లో విడుదలైన 'ఆడి పేరుకు' చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు శంకరన్‌. ఆ తర్వాత ఊరు, ఖైదీ, లీలావతి, ఖాదర్‌ కోట్టై తదితర చిత్రాల్లో నటించారు. కార్తీక్‌, రేవతి జంటగా నటించిన మౌనరాగం చిత్రంలో రేవతి తండ్రిగా చంద్రమౌళి అనే పాత్రలో నటించి బాగా పాపులర్‌ అయ్యారు. ఈయన చివరిగా 1999లో అళగర్‌ సామి అనే చిత్రంలో నటించారు.

1974లో విడుదలైన ఒన్నే ఒన్ను కన్నె కన్ను అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తేన్‌ సింధు దే వానం, దుర్గాదేవి, ఒరువనుక్కు ఒరుత్తి, తూండిల్‌ మీన్‌, పెరిమై కురియవన్‌, వేలుమ్‌ మైలుమ్‌ తున్నై, కుమారి పెణిన్‌ ఉళ్లత్తిలే వంటి పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడు భారతి రాజా ఈయన వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం.

చదవండి: అది కుక్కల చేతుల్లోకి వెళ్తోంది.. వారు విషం చిమ్ముతున్నారు..

>
మరిన్ని వార్తలు