Devil Movie: ఇంతవరకు డబ్బులివ్వలేదన్న డెవిల్‌ విలన్‌.. నిర్మాత ఏమన్నాడంటే?

14 Dec, 2023 18:21 IST|Sakshi

బింబిసార సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌. అయితే ఆ తర్వాత త్రిపాత్రాభినయంతో చేసిన అమిగోస్‌ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఇతడు డెవిల్‌ అనే భారీ బడ్జెట్‌ సినిమా చేస్తున్నాడు. ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనేది ఉపశీర్షిక. మాళవికా నాయర్‌, సంయుక్తా మీనన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా స్వీయదర్శకత్వంలో నిర్మించాడు.

మొదట్లో అతడు.. తర్వాత ఇతడు
ఈ సినిమా ఆది నుంచి ఏదో ఒక వివాదంలో చుట్టుకుంటూనే ఉంది. మొదట్లో ఈ సినిమాకు నవీన్‌ మేడారం దర్శకుడు అని చెప్పారు. రిలీజైన పోస్టర్‌లోనూ అతడినే డైరెక్టర్‌గా ప్రస్తావించారు. తర్వాత టీజర్‌ రిలీజ్‌ చేసినప్పుడు మాత్రం దర్శకుడి స్థానంలో అభిషేక్‌ నామా పేరును పెట్టేశారు. తాజాగా ఈ సినిమాలో విలన్‌గా నటించిన యాక్టర్‌ మార్క్‌ బెనింగ్‌టన్‌ చిత్రయూనిట్‌పై తీవ్ర విమర్శలు చేశాడు.

నాకు డబ్బులివ్వలే
మార్క్‌ మాట్లాడుతూ.. 'డెవిల్‌ సినిమా షూటింగ్‌ మొదట్లో బాగానే జరిగింది. చివరి షెడ్యూల్‌ జరిగేటప్పుడు మాత్రం కొన్ని మార్పుచేర్పులు జరిగాయి. నా పాత్ర షూటింగ్‌ అయిపోయి 9 నెలలు కావస్తోంది. ఇప్పటివరకు నాకు డబ్బులు ముట్టనేలేదు. అంతేకాదు, నా పాత్రకుగానూ వేరే వ్యక్తితో డబ్బింగ్‌ చెప్పించారు. అది నేను ట్రైలర్‌లో చూసి చాలా బాధపడ్డాను. ఇలా చేయడం నాతో చేసుకున్న కాంట్రాక్టును ఉల్లంఘించడమే అవుతుంది' అని మండిపడ్డాడు. ఇలాంటి పని చేయడానికి కాస్తైనా సిగ్గుండాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లోనూ డెవిల్‌ నిర్మాతలపై ఫైర్‌ అయ్యాడు.

మెంటల్‌ టార్చర్‌..
తాజాగా ఈ విషయంపై డెవిల్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత మోహిత్‌ రాల్యాని స్పందించాడు. నటుడి పోస్ట్‌కు కామెంట్‌ చేస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. 'నీ మేనేజర్‌ మమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడో ఇచ్చేశాం. అయినా కూడా ఇంకా డబ్బు కావాలంటూ మానసికంగా వేధిస్తున్నారు. నీ పాత్రకు వేరేవారితో డబ్బింగ్‌ చెప్పిన విషయానికి వస్తే.. నువ్వు తెలుగు మాట్లాడగలవా? లేదు.. అలాంటప్పుడు ఇంగ్లీష్‌ డైలాగులకు నీ వాయిస్‌, తెలుగు డైలాగులకు వేరొకరి వాయిస్‌ ఎలా వాడగలం?

అగ్రిమెంట్‌లో ఆ రూల్‌ లేదు..
పైగా మీడియాలో మా నిర్మాణ సంస్థ ప్రతిష్ట దిగజార్చేలా వార్తలు ప్రచారం చేయిస్తున్నావు. నీ వాయిస్‌ వాడలేదని మమ్మల్ని కించపరుస్తున్నావు. నీ మాటలు నమ్మిన కొందరు నిజానిజాలు తెలుసుకోకుండానే వార్తలు రాసేస్తున్నారు. అసలు అగ్రిమెంట్‌లో నీ పాత్రకు నువ్వే డబ్బింగ్‌ చెప్పాలన్న నిబంధనే లేదు. ఎప్పుడేం చేయాలనేది నిర్మాత ఇష్టం. మనం ఇలా అందరి ముందు గొడవపడుతుండటం అసహ్యంగా ఉంది. నీపై నాకు చాలా గౌరవం ఉంది. ఆ విషయం నీక్కూడా తెలుసు. నీ నుంచి ఫోన్‌ కాల్‌ కోసం ఎదురుచూస్తుంటా' అని రాసుకొచ్చాడు. ఈ గొడవ సద్దుమణిగిందో మరేంటో కానీ కాసేపటి క్రితమే మార్క్‌ బెనింగ్‌టన్‌ డెవిల్‌ చిత్రయూనిట్‌ను తిడుతూ పెట్టిన పోస్టులను డిలీట్‌ చేశాడు. డెవిల్‌ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.

చదవండి: ఏడాది తిరగకముందే భార్యకు కటీఫ్‌.. నాలుగోసారి ప్రేమలో మ్యూజిక్‌ డైరెక్టర్‌..

>
మరిన్ని వార్తలు