Rohit Sharma: టి20ల్లో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు

6 Nov, 2022 21:45 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆదివారం ముగిసిన సూపర్‌-12 పోటీల్లో టీమిండియా జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో నెగ్గి గ్రూప్‌-2 టాపర్‌గా సెమీస్‌కు చేరుకుంది. నవంబర్‌ 10(గురువారం) ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌-2లో టీమిండియా అమితుమీ తేల్చుకోనుంది. ఈ సంగతి పక్కనబెడితే టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు.

జింబాబ్వేపై విజయం ఈ ఏడాది టి20ల్లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు 21వది. ఈ నేపథ్యంలో ఒక ఏడాదిలో అత్యధిక టి20 విజయాలు అందుకున్న సారథిగా రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2021లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(20 విజయాలు) అందుకున్నాడు. తాజాగా బాబర్‌ను వెనక్కి నెట్టిన హిట్‌మ్యాన్‌ తొలిస్థానంలో నిలిచాడు. 2018లో పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ 18 టి20 విజయాలు అందుకోగా.. 2016లో ఎంఎస్ ధోనీ 15 విజయాలు అందుకున్నాడు.

ఈ ఏడాది 50+ పరుగుల తేడాతో విజయం అందుకోవడం టీమిండియాకి ఇది 10వ సారి. ఇదే ఏడాది 6 సార్లు 50+ పరుగుల తేడాతో విజయం అందుకున్న న్యూజిలాండ్ రెండో పొజిషన్‌లో ఉంటే, 2018లో పాకిస్తాన్ 5 సార్లు ఈ ఫీట్ సాధించింది..

ఓవరాల్‌గా రోహిత్ శర్మకు ఆటగాడిగా ఇది 100వ టి20 విజయం. ఇంతకుముందు పాక్ సీనియర్ క్రికెటర్ 87 టి20 విజయాల్లో భాగం పంచుకోగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 75 విజయాల్లో భాగస్వామిగా ఉన్నాడు. 

జింబాబ్వేతో జరిగిన టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్‌  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది సూర్యకుమార్‌కు ఇది ఆరో అవార్డు కావడం విశేషం. 2016లో విరాట్ కోహ్లీ 6 సార్లు టీ20ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలవగా ప్రస్తుతం సూర్య దానిని సమం చేశాడు.

చదవండి: అభిమానంతో రోహిత్‌ వద్దకు.. ఒక్క హగ్‌ అంటూ కన్నీటిపర్యంతం

ఏమా కొట్టుడు.. 'మిస్టర్‌ 360' పేరు సార్థకం

మరిన్ని వార్తలు