చెలరేగిన వేడ్‌, మ్యాక్స్‌వెల్‌ .. టార్గెట్‌ 187

8 Dec, 2020 15:38 IST|Sakshi

సిడ్నీ :  ఆసీస్‌ ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ చెలరేగడంతో మూడో టీ20లో ఆసీస్‌ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టీమిండియాకు 187  పరుగులు టార్గెట్‌ను నిర్ధేశించింది. ముందుగా టాస్‌ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ ఎంచుకొని ఆసీస్‌ను‌ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ రెండో ఓవర్‌ వేసిన వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ ఆనందం టీమిండియాకు ఎంతోసేపు నిలవలేదు.

ఫించ్‌ వెనుదిరిగిన అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి మరో ఓపెనర్‌ వేడ్‌ చెలరేగిపోయాడు. అయితే మరోసారి బౌలింగ్‌కు వచ్చిన సుందర్‌ 24 పరుగులు చేసిన స్మిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్‌  79 పరుగులు వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‌ దాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. ఈ దశలో వేడ్ టోర్నీలో వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ సాధించాడు.

హాఫ్‌ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన వేడ్‌.. ఫోర్లు, సిక్సర్లు బాదేశాడు. మ్యాక్స్‌వెల్‌ కూడా బ్యాట్‌కు పనిజెప్పడంతో ఆసీస్‌కు పరుగులు వేగంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో మ్యాక్స్‌వెల్‌ కూడా 30 బంతుల్లో టోర్నీలో తొలి ఫిప్టీ సాధించాడు. అయితే స్కోరును పెంచే ప్రయత్నంలో వేడ్‌, మ్యాక్స్‌వెల్‌ అవుటవడం.. చివరి రెండు ఓవర్లు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్‌ చేయడంతో ఆసీస్‌ 20 ఓవర్లలో 186 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ముగించింది. టీమిండియా బౌలర్లలో  సుందర్‌ 2, నటరాజన్‌, ఠాకూర్‌లు చెరో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు