హైదరాబాద్‌ ఎఫ్‌సీ భారీ విజయం; చెస్‌లో అదరగొట్టిన ఇమ్రోజ్‌, సరయు!

14 Dec, 2021 09:14 IST|Sakshi

Indian Super League: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీలో భాగంగా గోవాలో సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) 5–1తో నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ జట్టుపై నెగ్గింది. హైదరాబాద్‌ తరఫున సానా (12వ ని.లో), అనికేత్‌ (90వ ని.లో), సివెరియో (90వ ని.లో) ఒక్కో గోల్‌ చేయగా... ఒగ్బెచె (27వ, 78వ ని.లో) రెండు గోల్స్‌ సాధించాడు. 

చాంప్స్‌ ఇమ్రోజ్, సరయు
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అండర్‌ –19 జూనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో బాలుర విభాగంలో మొహమ్మద్‌ బాషిఖ్‌ ఇమ్రోజ్‌ (నల్లగొండ–6.5 పాయింట్లు), బాలికల విభాగంలో వేల్పుల సరయు (వరంగల్‌–5.5 పాయింట్లు) చాంపియన్స్‌గా నిలిచారు. హైదరాబాద్‌ జిల్లాకు చెందిన శిబి శ్రీనివాస్‌ ఐన్‌స్టీన్‌ రెడ్డి (బద్రుకా కాలేజీ) 6 పాయింట్లతో తొలి రన్నరప్‌గా, సూరపనేని చిద్విలాస్‌ సాయి (హైదరాబాద్‌) రెండో రన్నరప్‌గా నిలిచారు.

కర్రి శరత్‌చంద్ర (రంగారెడ్డి) నాలుగో స్థానాన్ని పొందాడు. టాప్‌–4లో నిలిచిన ఈ నలుగురూ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. బాలికల విభాగంలో సరయు, గంటా కీర్తి (మేడ్చల్‌), లేళ్లపల్లి దుర్గా కార్తీక, ఎ.సాయి మహతి (రంగారెడ్డి) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ నలుగురు కూడా జాతీయ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు తరఫున బరిలోకి దిగుతారు. విజేతలకు టీఎస్‌సీఏ అధ్యక్షుడు కేఎస్‌ ప్రసాద్‌ బహుమతులు అందజేశారు. 

చదవండి: Trolls On Rohit Sharma: వైస్‌ కెప్టెన్‌ కాదు.. ముందు ఫిట్‌గా ఉండు.. కోహ్లితో పెట్టుకున్నావు.. ఇదో గుణపాఠం! అయినా ఆ స్కోర్లేంటి బాబూ!

మరిన్ని వార్తలు