Sharath Kamal: 24 ఏళ్లపుడు.. మళ్లీ 40 ఏళ్ల వయసులో! రెండు స్వర్ణాలు.. రాజమండ్రి నుంచి..

3 Dec, 2023 12:23 IST|Sakshi

2006 మెల్‌బోర్న్‌ కామన్వెల్త్‌ క్రీడలు.. 24 ఏళ్ల యువ ఆటగాడు టేబుల్‌ టెన్నిస్‌లో అద్భుత ప్రదర్శనతో చెలరేగి పురుషుల సింగిల్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడలు.. 40 ఏళ్ల వెటరన్‌ ఆటగాడు టేబుల్‌ టెన్నిస్‌లో అద్భుత ప్రదర్శనతో చెలరేగి పురుషుల సింగిల్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు.

ఈ రెండు పతకాల మధ్య 16 ఏళ్ల అంతరం ఉంది. అయితే అప్పటి యువ ఆటగాడు, ఇప్పటి వెటరన్‌ ఆటలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. అదే దూకుడు, అదే పట్టుదల, అదే విజయకాంక్ష, అందుకోసం తీవ్రంగా శ్రమించే తత్వం! అతనే ఆచంట శరత్‌కమల్‌..

ఈ 16 ఏళ్ల కామన్వెల్త్‌ క్రీడల ప్రస్థానంలో ఏకంగా 13 పతకాలు, వాటిలో 7 స్వర్ణాలు సాధించిన శరత్‌ కమల్‌ 41 ఏళ్ల వయసులోనూ ఆటే ప్రాణంగా దూసుకుపోతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మదరాసులో పుట్టి పెరిగిన ఈ తెలుగు ప్లేయర్‌ సుదీర్ఘ కాలంతో తన ఆటతో ప్రత్యేక ముద్ర వేసి భారత టేబుల్‌ టెన్నిస్‌కు పర్యాయపదంగా నిలిచాడు. 

ఎనిమిదేళ్ల క్రితం శరత్‌ కమల్‌ తుంటికి గాయమైంది. 20 సెంటీ మీటర్ల చీలిక రావడంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. కోలుకునే క్రమంలో దాదాపు రెండు నెలల పాటు అతను వీల్‌చెయిర్‌లోనే ఉన్నాడు. ఆపై మరో మూడు వారాల పాటు క్రచెస్‌తోనే నడక. ఈ సమయంలో ఇంకా కెరీర్‌ కొనసాగుతుందని ఎవరూ అనుకోరు. శరత్‌ కూడా అదే భావనతో ఉన్నాడు.

అయితే ఆటపై ఉన్న మమకారం అతనిలో పట్టుదలను పెంచింది. కోలుకున్న తర్వాత పూర్తి ఫిట్‌నెస్‌ను అందుకోవడంపై దృష్టి పెట్టిన శరత్‌ మళ్లీ తన ఆటను మొదలుపెట్టాడు. పునరాగమనం ఏదో నామ్‌కే వాస్తేగా జరగలేదు. తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించిన శరత్‌ తర్వాతి ఏడాది రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఆపై కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం, రజత, కాంస్యాలతో మెరిశాడు.

అదే ఏడాది ఆసియా క్రీడల్లోనూ రెండు కాంస్యాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఎదురులేకుండా అతను తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడంలో సఫలమయ్యాడు. ఇది అతని మానసిక దృఢత్వాన్ని చూపిస్తోంది. ఆట మొదలుపెట్టిన కొత్తలో ఓటమి ఎదురైనప్పుడు తట్టుకోలేక తీవ్ర అసహనాన్ని ప్రదర్శించే అలవాటు శరత్‌లో ఉండేది.

గెలుపోటములను సమానంగా స్వీకరించలేకపోయాడు. ఈ లక్షణాన్ని తగ్గించేందుకు శరత్‌ తండ్రి, బాబాయ్‌ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అదే అనుభవంతో తర్వాతి రోజుల్లో ఎంతో పరిపక్వత ప్రదర్శించిన శరత్‌ ఇప్పటి వరకు దానిని కొనసాగించడంలో సఫలమయ్యాడు. 

తండ్రి ప్రోత్సాహంతో..
శరత్‌ కమల్‌ తండ్రి శ్రీనివాసరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి. ఆయనతో పాటు ఆయన సోదరుడు మురళీధర్‌రావుకూ టేబుల్‌ టెన్నిస్‌ అంటే బాగా ఇష్టం. అయితే రాజమండ్రిలో శిక్షణకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో టీటీని కెరీర్‌గా మలచుకునే క్రమంలో మద్రాసు చేరారు. అక్కడ సాధన తర్వాత జాతీయ స్థాయి పోటీల వరకు వారు వెళ్లగలిగారే తప్ప పెద్ద స్థాయి కలలు కనలేకపోయారు.

తర్వాతి దశలో టేబుల్‌ టెన్నిస్‌ కోచ్‌గా శ్రీనివాసరావు కొత్త ప్రయాణం మొదలైంది. సహజంగానే తాము సాధించలేనిదాన్ని తమ శిష్యుల ద్వారా సాధించాలనే కోరిక, తపన కోచ్‌లలో ఉంటుంది. అలా అక్కడ ఆయన కోచింగ్‌ మొదలైంది. ఆ క్రమంలో శిక్షణ పొందుతూ వచ్చినవారి జాబితాలో కొద్ది రోజులకే ఆయన కొడుకు కూడా చేరాడు. పసివాడిగా ఉన్నప్పుడు తండ్రి వెంట కోచింగ్‌ కేంద్రానికి వెళుతూ వచ్చిన శరత్‌కూ టీటీపై ఆసక్తి పెరగడం శ్రీనివాసరావు పనిని సులువు చేసింది.

ప్రాథమికంగా ఓనమాలు నేర్పించిన తర్వాత కమల్‌లో నిజంగానే అరుదైన ప్రతిభ ఉందని గుర్తించిన తండ్రి సరైన శిక్షణతో బాగా ప్రోత్సహించాడు. దాంతో తమిళనాడు రాష్ట్ర స్థాయి పోటీల్లో అతను పాల్గొనడం మొదలైంది. అండర్‌–10, అండర్‌–12, అండర్‌–14, అండర్‌–17లలో రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్‌లో శరత్‌ హవా సాగింది.

సరిగ్గా ఆ సమయంలోనే ఆటను కొనసాగించాలా లేక ఇంజినీరింగ్‌ వైపు వెళ్లాలా అని ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. మంచి ఫలితాలు సాధిస్తూ కూడా ఆటను వదిలిపెట్టిన చాలామంది గురించి శ్రీనివాసరావుకు బాగా తెలుసు.

కానీ తన కుమారుడి విషయంలో మాత్రం ఆయన అలాంటి తప్పు చేయలేదు. టీటీపైనే దృష్టి పెట్టమని ప్రోత్సహిస్తూ దిశానిర్దేశం చేశాడు. దాని ఫలితాలు ఆ తర్వాత అద్భుతంగా వచ్చాయి. 

అలా మొదలైంది..
సరిగ్గా 20 ఏళ్ల వయసులో శరత్‌కమల్‌ 2002లో తొలిసారి జాతీయ చాంపియన్‌షిప్‌లో రాణించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆపై భారత జట్టుకు కామన్వెల్త్‌ క్రీడల కోసం నిర్వహించిన ప్రత్యేక క్యాంప్‌కీ ఎంపికయ్యాడు. జూనియర్‌ కావడంతో ఈసారి కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే అవకాశం రాకపోయినా సీనియర్ల సాహచర్యంలో ఎంతో నేర్చుకునే అవకాశం దక్కింది.

తర్వాతి ఏడాదే అతను తొలిసారి జాతీయ చాంపియన్‌షిప్‌లో (2003) విజేతగా నిలవడంతో భారత టీటీలో కొత్త మార్పుకు అంకురార్పణ జరిగింది. 2003లో జరిగిన టీటీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ శరత్‌ కెరీర్‌లో తొలి మెగా టోర్నీ కాగా, తర్వాతి ఏడాది కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో అతను తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ పతకాన్ని గెలుచుకున్నాడు. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం రావడం అతని కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో శరత్‌ పోరు రెండు రౌండ్‌లకే పరిమితమైనా అతని ఆట పదును పెరిగింది. 

కామన్వెల్త్‌లో హవా..
అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య ప్రొఫెషనల్‌ టూర్‌ టైటిల్స్‌ పోటీల్లో రాణించడం అంత సులువు కాదు. చైనాతో పాటు యూరోపియన్‌ ఆటగాళ్ల హవా అక్కడ కొనసాగుతుంది. అయితే ఇక్కడా శరత్‌ తన ముద్ర చూపించాడు.

కెరీర్‌లో రెండు ప్రొఫెషనల్‌ టూర్‌ టైటిల్స్‌ సాధించిన అతను భారత టేబుల్‌ టెన్నిస్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. శరత్‌కు కామన్వెల్త్‌ క్రీడలతో ప్రత్యేక అనుబంధం ఉంది. వరుసగా ఐదు సార్లు 2006, 2010, 2014, 2018, 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్నాడు. సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్, టీమ్‌ విభాగాలు.. ఇలా అన్నింటిలో అతను చెలరేగిపోయాడు.

ఫలితంగా అతను ఖాతాలో ఏకంగా 13 కామన్వెల్త్‌ క్రీడల పతకాలు ఉన్నాయి. ఇందులో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ఆసియా క్రీడల్లో 2 కాంస్యాలు సాధించిన అతను ఆసియా చాంపియన్‌షిప్‌లో మరో 3 పతకాలు సాధించడం విశేషం. మరో వైపు విదేశీ లీగ్‌లలో కూడా తన సత్తాను చూపించాడు. ప్రపంచ టీటీలో ప్రతిష్ఠాత్మకంగా భావించే బుందేస్‌లిగా (జర్మనీ)లో కూడా ఆడిన అతను 2010–11 సీజన్‌లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు.

దీంతో పాటు డచ్, స్వీడన్, స్పానిష్‌ లీగ్‌లలో కూడా అతను ఆడాడు. దురదృష్టవశాత్తు శరత్‌ మెరుపులు ఒలింపిక్స్‌లో ఫలితాన్ని అందించలేదు. 2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లలో పాల్గొన్నా పతకం అతని దరి చేరలేదు.

వరుస గాయాలతో బాధపడుతూ 2012 లండన్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. అయితే ఒలింపిక్స్‌ పతకం లేకపోయినా శరత్‌ సాధించిన ఘనతలు అతని స్థాయిని చూపించాయి. ఇప్పుడు 41 ఏళ్ల వయసులోనూ కొత్త ఉత్సాహంతో చెలరేగిపోతున్న శరత్‌ కమల్‌ 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే లక్ష్యంతో సిద్ధమవుతున్నాడు. 

10 – భారత టేబుల్‌ టెన్నిస్‌ చరిత్రలో 10 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన రికార్డు శరత్‌ సొంతం. 2019లో తొమ్మిదో టైటిల్‌ గెలిచి కమలేశ్‌ మెహతా (8) రెండు దశాబ్దాల రికార్డు బద్దలు కొట్టిన అతను 2022లో పదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 30వ స్థానానికి చేరిన శరత్‌ కమల్‌.. భారత ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక అర్జున, పద్మశ్రీ, ఖేల్‌రత్న పురస్కారాలను అందుకున్నాడు.  
-మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

చదవండి: Ind vs Pak: మెగా క్రికెట్‌ టోర్నీ షెడ్యూల్‌ విడుదల.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ ఆరోజే

మరిన్ని వార్తలు