బజరంగ్‌పైనే ఆశలు

6 Aug, 2021 05:03 IST|Sakshi

రెజ్లింగ్‌లో మిగిలి ఉన్న ఇద్దరు భారత రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, సీమా బిస్లా శుక్రవారం బరిలోకి దిగనున్నారు. బజరంగ్‌ పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగంలో... సీమా బిస్లా మహిళల ఫ్రీస్టయిల్‌ 50 కేజీల విభాగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఈ ఇద్దరిలో బజరంగ్‌పైనే భారత్‌కు భారీ అంచనాలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న బజరంగ్‌కు ఒలింపిక్‌ పతకం మాత్రమే లోటుగా ఉంది. ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత వేదికపై అందరూ పతకం గెలవడానికి వస్తారు కాబట్టి ప్రత్యర్థులను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుందనడంలో సందేహం లేదు. తొలి రౌండ్‌లో కిర్గిజిస్తాన్‌ రెజ్లర్‌ ఎర్నాజర్‌ అక్మతలియెవ్‌తో బజరంగ్‌ ఆడతాడు.

ఈ బౌట్‌లో గెలిస్తే క్వార్టర్‌ ఫైనల్‌ ఇరాన్‌ రెజ్లర్‌ మొర్తెజా ఘియాసితో బజరంగ్‌ ఆడే చాన్స్‌ ఉంది. ఈ బౌట్‌లోనూ గెలిస్తే బజరంగ్‌కు సెమీఫైనల్లో 2016 రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత హాజీ అలియెవ్‌ (అజర్‌బైజాన్‌) లేదా దౌలత్‌ నియాజ్‌బెకోవ్‌ (కజకిస్తాన్‌) లేదా వాల్డెస్‌ తొబియర్‌ (క్యూబా) ప్రత్యర్థిగా ఉండే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ రషిదోవ్‌ (రష్యా), ప్రపంచ మాజీ చాంపియన్‌ టకుటో ఒటోగురు (జపాన్‌) ఫైనల్‌కు చేరుకోవచ్చు. భారత మహిళా రెజ్లర్‌ సీమా బిస్లాకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్లో సీమా ట్యునిషియా రెజ్లర్‌ సారా హమ్దీపై గెలిస్తే క్వార్టర్‌ ఫైనల్లో మూడుసార్లు ఒలింపిక్‌ రజత పతక విజేత, ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ మరియా స్టాడ్‌నిక్‌ (అజర్‌బైజాన్‌) ఎదురుకావడం ఖాయమనిపిస్తోంది. సీమా సంచలనం సృష్టించి సెమీఫైనల్‌ చేరితే యు సుసాకి (జపాన్‌) లేదా వాలెంటినా (కజకిస్తాన్‌)లలో ఒక్కరు ప్రత్యర్థిగా ఉండే అవకాశముంది.
బజరంగ్‌ తొలి రౌండ్‌: ఉదయం గం. 8:49 నుంచి; క్వార్టర్‌ ఫైనల్‌ (అర్హత సాధిస్తే): ఉదయం గం. 9:17 నుంచి; సెమీఫైనల్‌ (అర్హత సాధిస్తే): మధ్యాహ్నం గం. 2:55 నుంచి  

మరిన్ని వార్తలు