‘వీళ్లిద్దరూ డాట్‌ బాల్స్‌ ఇలాగే తింటారు’

8 Oct, 2020 10:07 IST|Sakshi

ధోని, కేదార్‌ జాదవ్‌పై నెటిజన్ల ట్రోలింగ్‌

అబుదాబి: కోల్‌కతా విసిరిన లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటతీరు పట్ల అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్‌ కూల్‌ ధోని, కేదార్‌ జాదవ్‌ తమను తీవ్ర నిరాశకు గురిచేశారని, కాస్త మెరుగ్గా ఆడి ఉంటే గెలుపు సొంతమయ్యేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్‌-2020 సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సీఎస్‌కేపై 10 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్‌ కాగా, సీఎస్‌కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. (చదవండి: ఛేజింగ్‌లో చేతులెత్తేసిన ధోని బృందం)

ఇక కేకేఆర్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ త్రిపాఠి (51 బంతుల్లో 81; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా, చెన్నై తరఫున షేన్‌ వాట్సన్‌ (40 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే మెరుగ్గా రాణించాడు. మిగిలిన వాళ్లంతా ఓ మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చేతులెత్తేశారు. ముఖ్యంగా ఆఖరి 24 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన తరుణంలో కెప్టెన్‌ ధోని క్లీన్‌బౌల్డ్‌ కాగా, 12 బంతులు ఎదుర్కొన్న కేదార్‌ జాదవ్‌ కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరు కలిసి 24 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశారు. ఇక చివరి ఓవర్లో 26 పరుగులు అవసరమైన వేళ రవీంద్ర జడేజా వరుసగా 6, 4, 4 బాదినా ఫలితం లేకుండా పోయింది. 

ఈ నేపథ్యంలో ధోని, కేదార్‌ జాదవ్‌లను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. బంతులు వృథా చేసి ఓటమికి కారణమయ్యారంటూ సెటైరికల్‌ వీడియోలు షేర్‌ చేస్తున్నారు. ‘‘ఇదిగో వీళ్లిద్దరూ డాట్‌ బాల్స్‌ ఇలాగే తింటారు’’అంటూ ఓ నెటిజన్‌ పేర్కొనగా, ‘‘ఇద్దరూ కలిసి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు, మీ పర్ఫామెన్స్‌ అంతకు మించి. ధోని ఏమో భారీ షాట్లు ఆడాలనుకున్నాడు. కేదార్‌ మాత్రం నేనొక్కడినే ఆడితే ఏం లాభం ఉంటుందిలే అన్నట్లు మిన్నకుండిపోయాడు. మ్యాచ్‌ తర్వాత వీళ్లిద్దరి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇలా ఉంటాయి. ఇది టెస్ట్‌మ్యాచ్‌ బ్యాటింగ్‌ ’’ అంటూ మరికొంత మంది మీమ్స్‌ షేర్‌ చేశారు. ఇక ఇంకొంత మంది మాత్రం, ఈ మ్యాచ్‌లో ధోని విఫలమైన విషయాన్ని పక్కనబెట్టి, కేవలం కేదార్‌నే ఓటమికి బాధ్యున్ని చేయడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు.

మరిన్ని వార్తలు